మహేష్‌బాబు 27వ చిత్రం గురించి గత రెండు నెలలుగా మీడియాలో ప్రముఖంగా వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. సరిలేరు నీకెవ్వరు చిత్రం విడుదలైన వెంటనే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ తదుపరి చిత్రం ఉంటుందని దాదాపుగా అందరు అనుకున్నారు. మహేష్‌బాబు కూడా పలు ఇంటర్వ్యూల్లో అధికారికంగా కూడా వంశీతో తన సినిమా ఉంటుంది అన్నట్లుగా హింట్ ఇచ్చాడు. కాని స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాని కారణంగా వంశీతో సినిమాను వచ్చే ఏడాదికి వాయిదా వేశాడు మహేష్.
సరిలేరు నీకెవ్వరు చిత్రం మొదలు పెట్టకముందే పరశురామ్ దర్శకత్వంలో మహేష్ సినిమా గురించి చర్చలు జరిగాయి. గీత గోవిందం విడుదలైన వెంటనే అల్లు అరవింద్ నిర్మాణంలో పరుశురామ్ దర్శకత్వంలో సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. కాని మహేష్ పారితోషికం విషయంలో పట్టు విడుపు చూపించక పోవడంతో అల్లు అరవింద్ ఆ ప్రయత్నంను విరమించుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. దాంతో అనీల్ సుంకర బ్యానర్‌లో సరిలేరు నీకెవ్వరు తెరకెక్కింది.
ఇప్పుడు పరుశురామ్ దర్శకత్వంలో మహేష్‌బాబు సినిమా పట్టాలెక్కేందుకు రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ సినిమా నిర్మాణంకు మైత్రి మూవీస్ ఇంకా 14 రీల్స్ వారు ముందుకు వచ్చారట. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించడంతో పాటు దాదాపుగా 60 కోట్ల పారితోషికంను మహేష్‌కు ఇచ్చేందుకు వీరు ఒప్పుకున్నట్లుగా సమాచారం అందుతోంది.
మహేష్ బాబు కోసం పరశురామ్ రెండు సంవత్సరాల క్రితమే స్టోరీ తయారు చేశాడు. త్వరలోనే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేయనున్నాడు. జూన్ లేదా జులైలో సినిమాను మొదలు పెట్టి వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా సినిమాను విడుదల చేయబోతున్నారట. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఈ కరోనా హడావుడి తగ్గిన తర్వాత ఉండే అవకాశం ఉందట.