ఆ విషయాలు ఇప్పుడు అనవసరం: కాజోల్‌

ఫిల్మీ బ్యాక్‌గ్రౌండ్‌ నుంచి వచ్చినప్పటికీ, సినీ పరిశ్రమ తనకేమీ రెడ్‌ కార్పెట్‌ పరిచేయలేదనీ, అవకాశాల్ని తానే వెతుక్కుంటూ వెళ్ళాననీ, సక్సెస్‌లు వచ్చినట్టే వచ్చినా ఫెయిల్యూర్స్‌ కుంగదీయడంతో ఎప్పటికప్పుడు పరిశ్రమలో ‘ఖచ్చితంగా నిలదొక్కుకోవాల్సిన’ పరిస్థితుల్ని ఎదురుచూశాననీ అంటోంది బాలీవుడ్‌ భామ కాజోల్‌.

బాలీవుడ్‌లో బ్యాక్‌గ్రౌండ్‌ లేనివారికి ఇబ్బందులు ఎక్కువేననీ, వారికి ‘కాస్టింగ్‌ కోచ్‌’ సమస్యలు సహజమనీ కొందరు హీరోయిన్లు చేస్తోన్న వ్యాఖ్యల్ని కాజోల్‌ ఖండించింది. ‘సినీ పరిశ్రమలోనే కాదు, ఎక్కడైనా ఈ తరహా సమస్యలు వుండొచ్చు.. వాటిని అధిగమించడంలోనే మనసత్తా ఏంటో బయటపడ్తుంది..’ అని చెప్పిన కాజోల్‌, సమస్య ఎదురైనప్పుడే దాని గురించి మాట్లాడటం మంచిదని, కొంత కాలం గడిచాక గతం గురించి మాట్లాడటం ఏమాత్రం సబబుగా అన్పించదని అభిప్రాయపడింది.

‘సమాజంలో అన్నిచోట్లా వున్నట్లే, సినీ పరిశ్రమలోనూ కొంత ఇబ్బందికరమైన పరిస్థితి మహిళలకు వుండొచ్చుగాక.. గ్లామర్‌ ప్రపంచం గనుక ఇక్కడ ఏ చిన్న విషయం జరిగినా, అది ఎక్కువ హైలైట్‌ అవుతుంది. కానీ, సినీ పరిశ్రమలో ఎక్కువశాతం మంచివాళ్ళే వుంటారన్నది నా వ్యక్తిగత అభిప్రాయం..’ అని క్లారిటీ ఇచ్చేసింది కాజోల్‌.