గోరంట్ల ప్రతిపక్షం – అచ్చెన్న అధికార పక్షం

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. అధికార పార్టీకి చెందిన ఇద్దరు నేతలు, అధికార – ప్రతిపక్ష నేతల తరహాలో ‘రోల్‌ ప్లే’ చేయడమే ఆ ఆసక్తికరమైన పరిణామం. మంత్రి అచ్చెన్నాయుడు ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చేలా మాట్లాడితే, టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రతిపక్షం తరఫున మాట్లాడుతున్నట్లుగా హడావిడి చేశారు.

వాస్తవ ప్రతిపక్షం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, అసెంబ్లీ సమావేశాలను బాయ్‌కాట్‌ చేయడంతో ‘మనమే ప్రతిపక్షం మనమే అధికారపక్షం’ అంటూ పార్టీ ముఖ్య నేతలకు టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దిశా నిర్దేశం చేసిన విషయం విదితమే. ఈ క్రమంలోనే ఈ ‘రోల్‌ ప్లే’ అంశం రంజుగా సాగింది.

అసలు విషయానికొస్తే, ఎమ్మెల్యేలు అడుగుతున్న ప్రశ్నల్ని మంత్రులు లైట్‌ తీసుకుంటున్నారనీ, మంత్రుల నుంచి సరైన సమాధానం రావడంలేదని గోరంట్ల గుస్సా అయ్యారు. ‘ఇలాగైతే, జీరో అవర్‌ ఎందుకు.?’ అంటూ గోరంట్ల ఓ రేంజ్‌లో ఆవేశకావేశాలకు లోనయ్యారు. దాంతో స్పందించిన మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేల ప్రశ్నల్ని ప్రభుత్వం లైట్‌ తీసుకోవడంలేదనీ, అప్పటికప్పుడు సమాధానాలు ఇవ్వలేకపోతున్నా, ఆ తర్వాత పూర్తిస్థాయిలో ఎమ్మెల్యేల అనుమానాల్ని నివృత్తి చేస్తున్నామనీ, ఒక్కోసారి ప్రిపేర్‌ అయి రావడం జరగదు గనుక, కమ్యూనికేషన్‌ గ్యాప్‌ వుండడం సహజమేనని సెలవిచ్చారు.

‘అసెంబ్లీ చప్పగా సాగుతోంది.. ప్రతిపక్షం లేకపోవడంతోనే ఈ పరిస్థితి.. నిద్దరొచ్చేస్తోంది..’ అంటూ బీజేపీ శానసభ్యులు సహా, కొందరు అధికార పార్టీ నేతలే వ్యాఖ్యానించిన దరిమిలా, ఈ కొత్త తరహా ‘రోల్‌ ప్లే’ తెరపైకొచ్చిందనుకోవాలేమో.!