ఈసారి ఏకంగా చంద్రబాబుకే కౌంటర్ ఇచ్చాడు

మొన్నటివరకు వాణి విశ్వనాథ్, అనిత, సోమిరెడ్డి లాంటివాళ్లకే కౌంటర్ ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ ఈసారి ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబునే టార్గెట్ చేశాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను పట్టించుకోవద్దని, దానిపై రియాక్ట్ అవ్వొద్దని సహచర మంత్రులకు చంద్రబాబు సూచించిన నేపథ్యంలో వర్మ స్పందించాడు.

“లక్ష్మి’స్ ఎన్టీఆర్ లో నిజాలను వక్రీకరిస్తే ప్రజలు హర్షించరు అన్న చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారి మాటలు ముమ్మాటికీ నిజం. అందుకనే నేను నిజంగా జరిగిన నిజాలనే ఏ మాత్రం వక్రీకరించకుండా తియ్యబోతున్నాను. CBN గారన్నట్టు NTR జీవితం తెరిచిన పుస్తకమే..కాని లక్ష్మి’స్ ఎన్టీఆర్ లో నేను ఆ పుస్తకం లోని చిరిగిపోయిన లేదా చింపబడ్డ చాలా పేజీలని తిరిగి అతికించబోతున్నాను.”

చంద్రబాబు వ్యాఖ్యలకు వర్మ కౌంటర్ ఇది. ఎవరెన్ని ధర్నాలు చేసినా, విమర్శలు చేసినా తను చూపించాల్సింది చూపించి తీరుతానంటున్నాడు వర్మ. అయితే వర్మ పల్స్ ను చంద్రబాబు మాత్రం బాగానే పసిగట్టారు. ఇకపై వర్మ గురించి, అతడు తీయబోయే సినిమా గురించి ఎక్కడా మాట్లాడొద్దని సహచరులకు గట్టిగానే సూచించారు.

ఎందుకంటే ఏం మాట్లాడినా అది వార్త అవుతుంది. మాట్లాడకుండా ఉంటేనే మరుగున పడుతుందనేది చంద్రబాబు ఆలోచన. కానీ పబ్లిసిటీ విషయంలో వర్మ, చంద్రబాబును ఎప్పుడో దాటేశాడు. ఆ విషయం టీడీపీ నాయకులకు తెలియంది కాదు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని వర్మ జాతీయస్థాయిలో హాట్ టాపిక్ గా మార్చడం ఖాయం. ఇప్పటికే ఆ పనిని సోషల్ మీడియాలో దిగ్విజయంగా మొదలుపెట్టాడు వర్మ.