రేవంత్‌కు ఆ కేసు భయం లేనట్టేనా..?

కత్తితో పొడిచిన వాడిది నేరం అవుతుందా? కత్తిని ఇచ్చి పొడవమన్న వాడిది నేరం అవుతుందా? ఇద్దరిదీ అవుతుంది కానీ, పొడవమన్నవాడిదే.. పెద్ద నేరం అవుతుంది, అని వేరే చెప్పనక్కర్లేదు. ఓటుకు నోటు కేసు వ్యవహారం ముందుకు వెళ్లినా ఇదే జరుగుతుంది… అనేది రేవంత్ రెడ్డి ధీమాగా కనిపిస్తోంది. తెలంగాణలో నామినేటెడ్ ఎమ్మెల్యే ఓటును కొనబోయిన వ్యవహారంలో రేవంత్ రెడ్డి వీడియోలకు చిక్కిన సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ వ్యవహారంలో బాబుగారి హస్తం ఫోన్ కాల్ తో ముడిపడిన వ్యవహారాన్ని కూడా వివరించనక్కర్లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి.. కొత్త రాజకీయానికి తెర తీశాడు కాబట్టి.. ఓటుకు నోటు కేసు కూడా కదులుతుంది.. అనే మాట వినిపిస్తుంది.

ఇన్నాళ్లూ రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ సీఎంతో సన్నిహిత సంబంధాలను మెయింటెయిన్ చేస్తోంది. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు సేఫ్, రేవంత్ రెడ్డి కూడా సేఫ్..గా ఉన్నాడు. అయితే ఇకపై అలా ఉండకపోవచ్చు.. అంటున్నారు. ఓటుకు నోటు కేసులో కీలక పరిణామాలు సంభవించవచ్చు.. రేవంత్ రెడ్డిని మళ్లీ ఆ కేసు పీడ చుట్టుకోవచ్చు.. అనే అభిప్రాయం వినిపిస్తోంది. అయితే ఈ వ్యవహారం గురించి రేవంత్ పెద్దగా భయపడనట్టుగానే ఉన్నాడు. చంద్రబాబు, చంద్రశేఖరరావులు కాంప్రమైజ్ అయిపోయిన నేపథ్యంలో… ఆ వ్యవహారం ఇక కదలదు అనిరేవంత్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడని తెలుస్తోంది.

ఒకవేళ ఇప్పుడు టీడీపీని వీడినందుకు గానూ రేవంత్ రెడ్డిపై ఓటుకు నోటు కేసు వ్యవహారంలో చర్యలు ఉంటాయా? అంటే.. ఆ కేసులో కేవలం రేవంత్ రెడ్డి మీద చర్యలు తీసుకోవడానికి ఉండకపోవచ్చు. అరెస్టు చేసి మళ్లీ జైల్లో పెట్టినా.. ఆ కేసు కదిలితే చంద్రబాబు సీటుకే ఎర్త్ వస్తుంది. కాబట్టి.. ఆ కేసు కదిలితే రేవంత్ కు వచ్చే ప్రమాదం కన్నా, చంద్రబాబుకే వచ్చే ప్రమాదమే ఎక్కువ. కాబట్టి.. దాన్ని అలాగే మూసేస్తారని అనుకోవాలి. ఇక్కడ మరో మాట కూడా వినిపిస్తోంది.

రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ లోకి పంపుతున్నదే చంద్రబాబు నాయుడు అనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. ప్రతి పార్టీలోనూ తన ఏజెంట్లు కొందరు ఉండాలి.. అనే లెక్క కింద రేవంత్ రెడ్డిని చంద్రబాబు నాయుడే పంపుతున్నాడు.. ఇదంత బాబు స్ట్రాటజీ అనే ఊహాగానాలున్నాయి.