ఈసారి జగన్‌కు.. వైసీపీ నినాదం ఫలిస్తుందా!

ఎన్నికల కురుక్షేత్రానికి విపక్ష నేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత జగన్‌ సన్నద్దమవుతున్నారు. ఇందులో భాగంగా ఆరునెలల పాదయాత్రకు ఆయన రెడీ అవుతున్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నేతల సమావేశంలో మాట్లాడుతూ వచ్చే ఏడాది అక్టోబర్‌లోనే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. బహుశా ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా ఏకకాలిక ఎన్నికలకు గాను ఏర్పాట్లు చేస్తున్నందున ఆ ప్రకారం జరిగే అవకాశం ఉందని అనుకోవాలి.

జగన్‌ పాదయత్ర చేపట్టడం ఒక సాహసమే అని చెప్పాలి. ఆయన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాదయాత్ర ద్వారా ప్రకంపనలు సృష్టించారు. అలాగే సోదరి షర్మిల కూడా పాదయాత్ర చేసి ఒక మహిళగా సంచలనం కలిగించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కూడా పాదయాత్ర నిర్వహించారు. ఆ సమయంలోనే ఆయన రుణమాఫీతో అనేక వందల వాగ్ధానాలు చేశారు.

అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఏపీలో తెలంగాణలో పర్యటించే సమయంలో చంద్రబాబు తాను ఏపీ విభజనకు ఎంత కట్టుబడి ఉన్నానో చెప్పేవారు. ఆయన ఆ తర్వాత కృష్ణాజిల్లాలో ప్రవేశించినప్పుడు సమైక్య వాదులుగా ఉన్న లగడపాటి రాజగోపాల్‌ బృందం ఆయనను కలిసి మనసు మార్చుకోవాలని కోరడానికి వేళ్లే ప్రయత్నం చేస్తే పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పుడు అదే చంద్రబాబు విభజనకు వ్యతిరేకంగా, తాను అచ్చమైన సమైక్యవాదిని అయినట్లు ప్రచారం చేసుకుంటున్నారు.

కాగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఉచిత విద్యుత్‌ హామీని మాత్రం విస్తతంగా ప్రచారం చేశారు. దానికి ప్రజలు కూడా ఆమోదం తెలిపారు. నిజానికి అప్పట్లో చంద్రబాబు ఉచిత విద్యుత్‌ సాధ్యంకాదని అనేవారు. కాని వైఎస్‌ రాగానే ప్రపంచ బ్యాంకును సైతం కాదని ఉచిత విద్యుత్‌ అమలు చేశారు. ఇక చంద్రబాబు మొత్తం రైతుల రుణాలన్నిటిని రద్దు చేస్తానని ప్రచారం చేసినా, ఆ ప్రకారం చేయకపోగా, ఇప్పుడు రైతులను రుణ విముక్తి చేసేశానని చెప్పుకుంటున్నారు.

89వేలకోట్ల రూపాయల రుణాలు ఉంటే ఇరవైనాలుగువేల కోట్ల రూపాయల రుణాలు రద్దు చేస్తున్నట్లు మూడేళ్ల క్రితం ప్రకటించి, వాటిలో కొంతభాగాన్ని మూడు విడతలుగా ఇచ్చి, ఇంకా అది కూడా పూర్తి చేయలేదు. అలాగే డ్వాక్రా మహిళల రుణాలను రద్దు చేస్తానని కూడా ప్రచారం చేశారు. ఇలా అలవికాని హామీలు ఇప్పించి ప్రజలను మోసం చేశారన్న విమర్శకు ఆయన గురవుతున్నారు.

ఈ నేపధ్యంలో జగన్‌ పాదయాత్రకు ప్రాముఖ్యత ఉంటుంది. ఆయన ఇప్పటికే నవరత్నాల పేరుతో వివిధ హామీలను ప్రకటించారు. వాటిని విశదీకరిస్తూ ఆయన జనంలోకి వెళుతున్నారు. వాటిలో ముఖ్యమైనది రైతులకు ఏభైవేల రూపాయల చొప్పున ఆర్ధిక సాయం చేయడం. డ్వాక్రా మహిళలకు నాలుగు దశలలో రుణమాఫీ, రైతులకు ధరల స్థిరీకరణ నిధిగా రెండువేల కోట్లు, వృద్దాప్య పెన్షన్‌ వెయ్యి నుంచి రెండువేల రూపాయలకు పెంపు మొదలైనవి ఉన్నాయి.

వీటిని నవరత్నాలుగా మాత్రమే ప్రచారం చేయకుండా విడివిడిగా సామాన్యులకు సైతం అర్దం అయ్యేలా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నినాదాలు తయారు చేసుకోవల్సి ఉంటుంది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌ రెడ్డి మాట్లాడుతూ ఈసారి జగన్‌కు అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరుతున్నామని అన్నారు. చంద్రబాబు పాలన చూశారు.. ఆయన ఎంత అప్రజాస్వామికంగా చేస్తున్నది, ఫిరాయింపు రాజకీయాలతో సహా ఆయా అంశాలలో విలువలు లేకుండా చేస్తున్న వైనం నేపథ్యంలో ఈసారి జగన్‌ అన్న నినాదం ఇచ్చారు.

గతంలో ఇదే నినాదంతో బీజేపీ అగ్రనేత వాజ్‌పేయ్‌ జనంలోకి వెళితే బాగా హిట్‌ అయింది. ఆయన అధికారంలోకి కూడా వచ్చారు. అలాగే జగన్‌ కూడా అధికారంలోకి వస్తారన్నది వైసీపీ నేతల నమ్మకంగా ఉంది. కేవలం నమ్మకాలు, విశ్వాసాలతోనే కాకుండా వాస్తవ పరిస్థితికి అనుగుణంగా ఈ పార్టీ వ్యూహాలు తయారు చేసుకోవాలి. చంద్రబాబుకు ప్రజలలో వ్యతిరేకత ఉన్నా, తనకు ఉన్న ఇతర శక్తులతో గెలుపు కోసం పనిచేస్తారు. ప్రజలను ఏ విధంగా మభ్య పెట్టవచ్చన్న దానిపై ఆయనకు విశేష అనుభవం ఉంది. ఆ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ముందుకు సాగాలన్న భావన ఉంది.

రాజకీయాలలో అధికార పార్టీ తప్పులు ఎండగట్టడం ఒకఎత్తు అయితే ప్రతిపక్షంలో ఉన్నవారు తప్పులు చేయకుండా ఉండడం మరోఎత్తు. ఎవరు కవ్వించినా, ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, వాటన్నిటికి పంచ్‌ డైలాగులతో సమాధానం ఇస్తూ ప్రజల సమస్యలే ప్రధానా లక్ష్యంగా జగన్‌ పాదయాత్ర ముందుకు సాగాలి. ఏపీలో టీడీపీ ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేకత ఉంది. దానిని జాగ్రత్తగా చానలైజ్‌ చేసుకోగలిగితే జగన్‌ ఆశించిన లక్ష్యం సాధించడం పెద్దంకష్టం ఏమీ కాకపోవచ్చు.

-కొమ్మినేని శ్రీనివాసరావు