‘అత్యుత్సాహం’ చిచ్చు ఆరుతుందా? రగులుతుందా?

ఏ రాజకీయ పార్టీలోనైనా విభేదాలు, మనస్పర్థల కారణంగా చిచ్చు రగులుతుంది. ఒక్కోసారి అది ఆరిపోవచ్చు, మరింత రగిలితే పార్టీయే చీలిపోవచ్చు. ఆ తరువాత క్రమంగా బలహీనపడొచ్చు. కాని తెలంగాణ టీడీపీలో విచిత్రంగా చిచ్చురేగింది. అత్యుత్సాహం కారణంగా వచ్చిన విభేదాలతో ఈ పరిణామం సంభవించింది. ఈ చిచ్చు ఆంధ్రాకూ పాకింది. అయితే రెండు రాష్ట్రాల్లో సందర్భాలు వేరు.

తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైన టీడీపీ చిచ్చుపై మీడియా, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాబోయే పర్యవసానాలు ఎలా ఉంటాయో అంతుబట్టకుండా ఉంది. చిచ్చు ఆరిపోతే ఫర్వాలేదు. కాని దాన్ని ఆర్పడానికి చర్యలు తీసుకోకుండా మరింత రగిలేందుకు దోహదం చేస్తే మాత్రం ‘పచ్చ’ పార్టీకి కష్టకాలం దాపురించే ప్రమాదం ఉంది.

ఇంతకూ చిచ్చు ఎలా రగిలింది?

సాధారణ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉండగానే తెలంగాణలో చాలాకాలం కిందటి నుంచి ప్రతిపక్షాలు పొత్తుల గురించి ఆలోచిస్తున్నాయి. టీఆర్‌ఎస్‌ను వచ్చే ఎన్నికల్లో ఓడించడం ఎలా? అన్నదే ప్రతిపక్షాల ఎజెండా. కేసీఆర్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పలు ప్రత్యక్ష పరోక్ష ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ వరుసగా విజయాలు సాధిస్తూ వస్తోంది. తాజాగా సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం కోసం జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అనుబంధ కార్మిక సంఘం ఘన విజయం సాధించి గులాబీ గుబాళింపును మరింత పెంచింది.

ఏ ఎన్నికల్లోనూ ప్రతిపక్షాలు దరిదాపుల్లోకి రాలేదు. టీఆర్‌ఎస్‌ బలం, కేసీఆర్‌ దక్షత, సత్తా ఇప్పటికే నిరూపితమయ్యాయి. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కే అధికారం దక్కుతుందని రాజకీయ విశ్లేషకులు, మీడియా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు వైరాలను, సిద్ధాంతాలను పక్కన పెట్టి కలిసి పనిచేయాలనుకుంటున్నాయి. గతంలో పాలేరు ఉపఎన్నికలో, సింగరేణి ఎన్నికల్లో ఉమ్మడిగా పోరాటం చేశాయి. ఇదే విధానాన్ని సాధారణ ఎన్నికల్లోనూ అమలు చేయాలనుకుంటున్నాయి.

దీంతో తెలంగాణ టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఫైర్‌బ్రాండ్‌ రేవంత్‌ రెడ్డి కాంగ్రెసుతో పొత్తు పెట్టుకుంటామని ప్రకటించారు. ఈ అభిప్రాయాన్ని పలుమార్లు వ్యక్తం చేశారు. అలనాడు ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపించిందే కాంగ్రెసు వ్యతిరేకత ప్రాతిపదికపైన. ప్రస్తుత ఏపీలోనూ టీడీపీకి కాంగ్రెసు ప్రత్యర్థి. ఈ నేపథ్యంలో రేవంత్‌ రెడ్డి ప్రకటన కొందరికి నచ్చలేదు. ఇది రేవంత్‌ వ్యక్తిగత అభిప్రాయమే అయినప్పటికీ పార్టీ విధానం ఇదేనన్నట్లుగా మాట్లాడారు. దీంతో ఆయన వ్యతిరేకులకు ఆగ్రహం కలిగింది. అసలే గవర్నర్‌ పదవి దక్కలేదని నిరాశతో గడుపుతున్న దళితనేత మోత్కుపల్లి నర్సింహులు టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోవాలన్నారు.

తెలంగాణలో పార్టీ బతకాలంటే టీఆర్‌ఎస్‌తో కలవాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక్కడే చిచ్చుకు బీజాలు పడ్డాయి. ఇక్కడ అర్థంకాని విషయం ఒకటుంది. టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోవాలని మోత్కుపల్లే చంద్రబాబుకు సలహా ఇచ్చారని కొందరు భావిస్తున్నారు. ఇది చంద్రబాబు ఆలోచనే అని, ఆయనే మోత్కుపల్లితో ప్రకటన చేయించారని మరికొందరి అభిప్రాయం. కాని ఎవరు కారణమనేది కరెక్టుగా తేలలేదు. ఈమధ్య చంద్రబాబు హైదరాబాదులో సమావేశం నిర్వహించి పొత్తులపై ఎన్నికల సమయంలోనే నిర్ణయిస్తామని, అప్పటివరకు ఎవ్వరూ తమకిష్టమొచ్చినట్లు ప్రకటనలు ఇవ్వడానికి వీల్లేదని హుకూం జారీ చేశారు. కాని స్పష్టంగా ఏ విషయమూ చెప్పలేదు.

రగిలిపోతున్న రేవంత్‌ వర్గం

గులాబీ పార్టీతో ‘పచ్చ’ పార్టీ పొత్తు పెట్టుకుంటుందనే ప్రచారం అధికం కావడంతో రేవంత్‌ రెడ్డి వర్గం రగిలిపోతోంది. అందులోనూ అధికార పార్టీతో పొత్తు ఉండదని చంద్రబాబు నాయుడు స్పష్టంగా ప్రకటించకపోవడం కూడా రేవంత్‌ వర్గానికి ఆగ్రహం కలిగిస్తోంది. అధినేత మనసులో ఏముందో బయటపెట్టకపోవడంతో పొత్తుకు అవకాశం ఉన్నట్లేననే అనుమానాలు బలపడుతున్నాయి. నిజానికి ఓ పక్క కేసీఆర్‌ సర్కారుపై పోరాటం చేస్తూ మరోపక్క పొత్తు ఆలోచనలు చేయడమంటే ఏమనుకోవాలి? కేసీఆర్‌ అధికారానికి వచ్చిన చాలాకాలంపాటు చంద్రబాబును, టీడీపీని బూతులు తిట్టారు. చంద్రబాబు తక్షణమే తెలంగాణను, హైదరాబాదును వదలిపెట్టి పోవాలన్నారు.

‘చంద్రబాబుకు ఇక్కడేం పని’ అని ప్రశ్నించారు. నిలువు లోతున గొయ్యితీసి టీడీపీని బొందపెడతామన్నారు. చెప్పుకుంటే ఇది చాలా పెద్దకథ అవుతుంది. అలాంటి కేసీఆర్‌తో అంటకాగే ఆలోచన ఉన్నట్లయితే సహజంగానే రేవంత్‌ వంటివారికి మండుకొస్తుంది. పార్టీ ఉనికిని ఆయనే కాపాడుతున్నాడని చెప్పుకోవచ్చు. కేసీఆర్‌పై ఒంటికాలిపై లేచే మొనగాడు, నేరుగా ఎదుర్కొనే నాయకుడు టీడీపీలో లేడనడం అతిశయోక్తి కాదు. తెలంగాణ పార్టీకి అధ్యక్షుడు ఎల్‌.రమణ అయినప్పటికీ ఆ విషయం ఎక్కువమందికి తెలియదు. ఒక్కమాటలో చెప్పాలంటే రేవంత్‌ పార్టీని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకున్నారు.

కేసీఆర్‌ తరువాత ముఖ్యమంత్రి అయ్యే అర్హతవున్న నాయకుడు ఈయనేనని కొంతకాలం క్రితం ఓ సర్వే తెలియచేసింది. ఇప్పుడున్న చాలామంది సీనియర్లకు రేవంత్‌ అంటే పడదు. కాని ఏమీ అనలేక గమ్మున ఉన్నారు. రేవంత్‌ ముందుకొస్తే తప్ప తెలంగాణలో పచ్చపార్టీ ఉద్యమాలు, పోరాటాలు చేసే పరిస్థితి లేదు. దేనికైనా అతను లీడ్‌ తీసుకుంటే తప్ప ఇతర నాయకులు కదలడంలేదు. ఓటుకు నోటు కేసులో తన పాత్ర కూడా ఉండటంతో రేవంత్‌ను బాబు ఏమీ అనలేకపోతున్నారు. టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోవడమంటూ జరిగితే రేవంత్‌ రెడ్డి, ఆయన అనుచరులు కాంగ్రెసులో కలిసిపోవడం ఖాయమంటున్నారు. ఇదే జరిగితే తెలంగాణ టీడీపీకి కోలుకోలేని దెబ్బ తగులుతుంది.

చిచ్చులో ఆజ్యంగా ఆంధ్రా టీడీపీ నేతల అత్యుత్సాహం

తెలంగాణలో ఈ చిచ్చు ఇలా ఉండగా, ఈమధ్య ఏపీమంత్రి పరిటాల సునీత కుమారుడి వివాహానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనంతపురం జిల్లాలోని వెంకటాపురానికి వెళ్లారు. పెళ్లికి హాజరయ్యే పేరుతో రాజకీయ ప్రయోజనాలు సాధించడం కోసం వెళ్లారనే ప్రచారం జరిగింది. అదలా ఉంటే, అక్కడ టీడీపీ సీనియర్‌ నేత పయ్యావుల కేశవ్‌ను ప్రత్యేకంగా పిలిపించుకొని మాట్లాడటం, కేసీఆర్‌, ఆయన కుమారుడు కేటీఆర్‌కు ఆంధ్రా టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికి, జయజయధ్వానాలు చేయడం మొదలైనవి తెలంగాణలో రగిలిన చిచ్చుకు ఆజ్యం పోశాయి.

తమ్ముళ్ల అత్యుత్సాహం బాబుకు కూడా కోపం తెప్పించింది. ఆంధ్రా నాయకుల అత్యుత్సాహంపై తెలంగాణ టీడీపీ నాయకులు ఆగ్రహించారు. ఈ విషయాన్ని చంద్రబాబు పార్టీ నేతల సమావేశంలో ప్రస్తావించారు. అత్యుత్సాహం తగ్గించుకోవాలని హెచ్చరించారు. కేసీఆర్‌ పట్ల అంత సాన్నిహిత్యం ఎందుకు ప్రదర్శించారని ప్రశ్నించారు. తాను ఆయనతో రెండు నిమిషాలు క్లుప్తంగా మాట్లాడి వెళ్లిపోగా, నాయకులు పరిధిదాటి అత్యుత్సాహం ప్రదర్శించారని అన్నారు. పయ్యావుల కేశవ్‌ ఏకాంతంగా ఎందుకు మాట్లాడారని అడిగారు.

‘తెలంగాణలో మన పార్టీ నేతలు రాజీనామా చేసి వెళ్లిపోతామంటున్నారు’ అని చెప్పారు. తెలంగాణలోనూ పార్టీ ఉంది కాబట్టి అక్కడి నాయకుల మనోభావాలనూ గమనించాలన్నారు. ఏది ఏమైనా తెలంగాణలో టీడీపీ ఒక విధమైన సంధికాలంలో ఉందని చెప్పొచ్చు. ఎప్పుడేం జరుగుతుందోనని పలువురు టీడీపీ నాయకులు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు. పొత్తుపై చంద్రబాబు ఇచ్చే స్పష్టత మీదనే ‘పచ్చ’ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంది.

-నాగ్‌ మేడేపల్లి