ఎన్టీఆర్‌ వాణీవిశ్వనాథ్‌ను పెళ్లాడాలని అనుకున్నాడా?

ఎన్టీఆర్ హీరోగా నటించిన ఆఖరి సినిమాలో హీరోయిన్ ని.. అని వాణీ విశ్వనాథ్ చాలా గొప్పగా చెప్పుకొంటూ ఉన్నారు. అయితే ఈ విషయం నేటి తరం యువతకు పెద్దగా తెలియదు. వాణీ విశ్వనాథ్ అంటే.. చిరంజీవి సినిమా ‘ఘరానామొగుడు’ మాత్రమే గుర్తుకు వస్తుంది. ఈమె నటిగా తెలుగులో బోలెడన్ని సినిమాల్లో నటించినా అవేవీ స్టార్ కాస్ట్ లేనివే కావడంతో పెద్దగా గుర్తింపు లేదనే చెప్పాలి.

ఇలాంటి నేపథ్యంలో ఈ మధ్యనే కేరెక్టర్ ఆర్టిస్టుగా తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చిన వాణీ.. తెలుగుదేశం పార్టీతో సఖ్యతగా మెలిగేసి.. రాజకీయంగా గుర్తింపుకు నోచుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా రోజానే తన లక్ష్యమన్నట్టుగా, నగరి నియోజకవర్గమే తన టార్గెట్ అన్నట్టుగా ఈమె వ్యవహరిస్తోంది. అయితే తెలుగు దేశం పార్టీలో ఆక్ పాక్ కరివేపాకుల జాబితాకు లోటేమీ లేదు.

ఇలాంటి నేపథ్యంలో వాణీ ప్రస్థానం ఎంత వరకూ వెళ్తుందో చూడాల్సి ఉంది. ఆ సంగతలా ఉంటే.. ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ ను బాగా ఓన్ చేసుకుంటున్న వాణీ విశ్వనాథ్‌ను పెళ్లి చేసుకుందామని ఎన్టీఆరే ఒక దశలో అనుకున్నాడనే టాక్ ఇప్పుడు మళ్లీ వినిపిస్తుండటం విశేషం. ఈ వ్యవహారం ఈనాటిది కాదు.. అర్లీ 90‌స్ లోది. ఆ సమయంలో కుటుంబ నిరాదరణతో ఒంటరి అయిపోయి, అధికారం కూడా చేతిలో లేక అల్లాడిపోయిన ఎన్టీఆర్ కు వాణి కూడా మంచి ఫ్రెండ్ అయ్యిందని అంటారు.

ఎన్టీఆర్ తో కలిసి నటించిన ఆమెను ఆయన అమితంగా అభిమానించాడట. ఆ విషయాన్ని వాణినే ఒకసారి ఒక తెలుగు మీడియా వర్గానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ‘సినిమా పూర్తి అయ్యాకా.. ఎన్టీఆర్ నన్ను ఇంటికి ఆహ్వానించారు. అప్పటికే రెమ్యూనరేషన్ ఇచ్చేసినా.. అదనంగా నా చేతిలో కొంత డబ్బు పెట్టి పంపించారు..’ అని వాణీ విశ్వనాథ్ ఆ మధ్య ఒక తెలుగు పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

ఆ సమయంలో ఎన్టీఆర్ ఎవర్నో ఒకరిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఆ జాబితాలో వాణీ కూడా ఉందనేది 90ల సినీ పత్రికలు చెప్పే మాట. ఎన్టీఆర్ ఆ వయసులో పెళ్లి చేసుకున్నది అయితే నిజం. లక్ష్మిపార్వతి దగ్గర కావడానికి మునుపు.. ఎన్టీఆర్ ఆ సమయంలో తనతో పని చేసిన హీరోయిన్లను కూడా పరిగణనలోకి తీసుకున్నాడని, వారిలో వాణీ విశ్వనాథ్, మీనాక్షి శేషాద్రి వంటి వాళ్లు ఉన్నారని.. నాటి పరిణామాలను గమనించిన వాళ్లు, నాటి పత్రికలను చదివిన వాళ్లూ చెబుతారు.

అయితే ఎన్టీఆర్ వారసులకు మాత్రం.. ఆయన మళ్లీ పెళ్లి చేసుకోవడం ఏ మాత్రం ఇష్టం లేదని, అందుకే.. వాణీకి, మీనాక్షికి గట్టి హెచ్చరికలు జారీ చేసి పంపించారని.. లక్ష్మీ పార్వతి విషయంలో కూడా వాళ్లు అలాగే వ్యవహరించినా.. ఎన్టీఆర్ వెనక్కు తగ్గక ఒక పబ్లిక్ మీటింగులోనే ఆమెతో వివాహ విషయాన్ని ప్రకటించాడని అంటారు.