‘ఎన్నికల్లోగా పోలవరం నీళ్లు’ … మరచిపోవాల్సిందే!

రాష్ట్రప్రజలకు ఇది దుర్వార్త. కేంద్రం మరో వంచనకు పాల్పడింది. చంద్రబాబునాయుడు కలలకు కేంద్రం చెక్ పెట్టింది. అనుకూలంగా ఉండే వ్యక్తులు చంద్రబాబు కలలాగానూ, ప్రతికూలంగా ఉండే వ్యక్తులు చంద్రబాబు వ్యూహం లాగానూ అభివర్ణించే పోలవరం ప్రాజెక్టు విషయంలో.. కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

ఏ పనిని ‘ప్రస్తుతానికి’ పూర్తి చేయడం ద్వారా.. ఎన్నికలకు ముందుగా పోలవరం ప్రాంతం నుంచి కొంత గోదావరి నీటిని మళ్లించి ఇతర ప్రాజెక్టులకు అందించడం ద్వారా.. తాను క్రెడిట్ కొట్టేసి..ప్రాజెక్టు మొత్తం పూర్తయినంతగా బిల్డప్ ఇచ్చి.. ఎన్నికలలో ఓట్ల మైలేజీ సాధించాలని చంద్రబాబు కలగంటున్నారో.. ఆ కలలను ఇక మరచిపోవచ్చు. తాజాగా కేంద్రం ఆదేశాల నేపథ్యంలో ‘ఎన్నికల్లోగా పోలవరం నీళ్లు’ అనే స్వప్నం నీరుగారిపోయినట్లే.

గత కాంగ్రెస్ ప్రభుత్వం ట్రాన్స్ ట్రాయ్ నిర్మాణ సంస్థకు పనులు అప్పగించే నాటికి దాని నిర్మాణానికి గడువు అయిదేళ్లు. అయితే జాప్యం కావడానికి వెనుక ఎవరిక కారణాలు వారికున్నాయి. అవన్నీ పక్కన పెట్టినా సరే.. 2019 తర్వాత మరో రెండేళ్లలో కూడా డ్యాం మొత్తం పూర్తయ్యే అవకాశం కూడా లేదని తెలుస్తోంది. డ్యాం మొత్తం పూర్తి చేస్తానని ప్రజలకు మాట ఇస్తే తన వైఫల్యం బయటపడక తప్పదని చంద్రబాబుకు బాగా క్లారిటీ ఉంది. ఆ నేపథ్యంలోనే ఆయన ‘‘ఎన్నికల్లోగా గ్రావిటీ ద్వారా నీళ్లు ఇస్తా’’ అనే పదం చెబుతున్నారు తప్ప.. ఏనాడూ పోలవరం పూర్తిచేస్తానని అనలేదు.

ఆయన అనుకున్నట్లుగా గ్రావిటీద్వారా నీళ్లు ఇవ్వాలంటే కాఫర్ డ్యాం పూర్తయినా సరిపోతుంది. కాబట్టి చంద్రబాబు ఫోకస్ మొత్తం కాఫర్ డ్యాం పై పెట్టారు. ఇటీవలి పరిణామాల్లో కొత్త టెండర్లు పిలవాలని అంటున్నది కూడా దీనికి సంబంధించిన పనులు చేపట్టడానికే. అయితే కేంద్రం లేటెస్టుగా ఈ ప్రయత్నాలకు మోకాలడ్డింది. అసలు కాఫర్ డ్యాం లేకుండానే.. పనులు చేయవచ్చునని, ఆ నిర్మాణ ప్రయత్నాలను ప్రస్తుతానికి ఆపాలని ఆదేశించింది. కాఫర్ డ్యాం అవసరం స్టడీ చేయడానికి ఓ నిపుణుల కమిటీ రావాల్సి ఉంది. వారి నివేదిక మేరకు సమీక్షించి నిర్ణయం తీసుకుంటారు.

ఇప్పుడిక పోలవరం పనులు ఆగినట్లే. తిరిగి ఎప్పుడు మొదలవుతాయో కూడా క్లారిటీ వచ్చే అవకాశం లేదు.