ఏం మాట్లాడొద్దు… గమ్మునుండాల్సిందే…!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుల నోరు నొక్కేస్తున్నారా? ఏం మాట్లాడకుండా గమ్మున ఉండమంటున్నారా? పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని ఏమీ ప్రశ్నించకూడదని ఆంక్షలు విధించారా? ఈ ప్రశ్నలకు ‘అవును’ అని సమాధానం వస్తోంది విచిత్రంగా, వినోదాత్మకంగా మాట్లాడే టీడీపీ ఎంపీ నుంచి.

ఆయనే అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి. ఆయన ఎప్పుడు ఎలా మాట్లాడతారో ఎవ్వరికీ అర్థం కాదు. ఒక్కోసారి చంద్రబాబును ప్రశంసిస్తున్నట్లుగా మాట్లాడతారు. మరోసారి విమర్శిస్తున్నట్లు మాట్లాడతారు. పొగుడుతున్నారో, తెగుడుతున్నారో కనుక్కోవడం కష్టమనే చెప్పాలి. ఆయన మాటల్లో అంత శ్లేష ఉంటుందన్నమాట. దివాకర్‌ రెడ్డి నేరుగా విమర్శించినా బాబు ఏమీ అనలేరు. తాజాగా ఈ ఎంపీ కొన్ని విషయాలు చెప్పారు.

ఢిల్లీలో టీడీపీ ఎంపీలకు విలువ లేదని, పట్టించుకునేవారే లేరన్నారు. తెలంగాణ ఎంపీలు ప్రభుత్వాన్ని దబాయించి మాట్లాడతారని, అదే టీడీపీ ఎంపీలు మాట్లాడలేరని చెప్పారు. ఏదైనా మాట్లాడదామంటే ‘బీజేపీ మనకు మిత్రపక్షం మాట్లాడొద్దు’ అంటూ బాబు తమ నోరు నొక్కేస్తున్నారని దివాకర్‌ రెడ్డి ఉన్న వాస్తవం చెప్పారు. వచ్చే ఎన్నికల్లోగా పోలవరం నిర్మాణం పూర్తి చేస్తానని ముఖ్యమంత్రి చెబుతుండగా, అది సాధ్యం కాదన్నారు దివాకర్‌ రెడ్డి. అయితే బాబు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని, ప్రాజెక్టు పూర్తి చేస్తారని ముక్తాయించారు.

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుందని మళ్లీ ఈమధ్య వార్తలొచ్చాయి. వీగిపోయిన ఆశలు మళ్లీ చిగురిస్తున్న నేపథ్యంలో దివాకర్‌ రెడ్డి నిరాశ నింపుతూ నియోజకవర్గాలు పెరగవన్నారు. బాబు తీవ్రంగా కృషి చేసి ప్రధాని మోదీని మెప్పించాల్సివుంటుందని, కాని సాధ్యం కాదని అన్నారు.

టీడీపీ సర్కారులోని మంత్రులకు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఎలాంటి అధికారాలూ లేవని కుండబద్దలు కొట్టారు. ప్రధాని, ముఖ్యమంత్రి పదవులకు మాత్రమే ఎన్నికలు జరిపితే చాలనే విషయం తాను ఎప్పుడో చెప్పానన్నారు. టీడీపీ ఎంపీల గురించి సరిగానే వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి అన్యాయం చేస్తున్నా ఏం మాట్లాడలేని పరిస్థితి ఉంది. కేంద్రాన్ని ఏమైనా అంటే నిధులు రావని, అభివృద్ధి ఆగిపోతుందని బాబు భయపడుతున్నారు.

వచ్చే ఎన్నికల్లోనూ బీజేపీతో కలిసి పనిచేస్తామన్నారు. చట్టప్రకారం, రాజ్యాంగబద్ధంగా రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు ఆపే అధికారం ప్రధానికి ఉందా? ఢిల్లీలో మోదీకి సొంత ఖజానా ఉందా? పశ్చిమ బెంగాల్‌, ఒడిషా, త్రిపుర, కర్నాటక..ఇలా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రానికి వ్యతిరేకం. వ్యతిరేకమంటే అవి బీజేపీయేతర పార్టీల పాలనలో ఉన్నాయి. మరి ఆ రాష్ట్రాలకు మోదీ నిధులు ఆపేసి ఏడిపిస్తున్నారా? ప్రధానిని మంచి చేసుకోకపోతే అభివృద్ధి ఆగిపోతుందని వారంతా ఆయన భజన చేస్తున్నారా? వారి ఎంపీలను కట్టడి చేస్తున్నారా?

టీడీపీ ఎంపీల్లో చాలామందికి బీజేపీతో స్నేహం ఇష్టం లేదు. కాని బాబు వైఖరి ప్రకారం చేయాల్సివస్తోంది. వచ్చే ఎన్నికలనాటికి బీజేపీ ప్రభ తగ్గిందని భావిస్తే బాబు పొత్తుకు మంగళం పాడతారేమో చెప్పలేం. ఇక జేపీ దివాకర్‌ రెడ్డి విషయానికొస్తే, జేసీ టీడీపీ ఎంపీ అయినా ‘పచ్చ’దనం పూర్తిగా పులుముకోలేదనిపిస్తోంది. గత ఎన్నికలప్పుడు కాంగ్రెసు గెలిచే అవకాశం లేదని అంచనా వేసుకునే టీడీపీలో చేరి విజయం సాధించారు. వాస్తవానికి వ్యక్తిగత ఛరిస్మా ఉన్న కాంగ్రెసు నాయకులు కూడా ఇంటిబాట పట్టారు. జేసీకి వ్యక్తిగత ఇమేజ్‌కు తక్కువ లేదు. కాని కాంగ్రెసు అభ్యర్థిగా పోటీ చేసుంటే ఆయనిప్పుడు సీన్‌లో ఉండకపోయేవాడే.

చంద్రబాబంటే విపరీతమైన అభిమానమో, టీడీపీ అంటే ప్రేమో ఆయనకు లేవని చెప్పొచ్చు. జేసీ ఏం మాట్లాడినా మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతూ ఉంటుంది. ఒకసారి జేసీ మాట్లాడుతూ చంద్రబాబు పిలుపు ఇవ్వగానే ప్రజలు తరలిరావడానికి, ఏకం కావడానికి ఆయనేమీ మహాత్మా గాంధీ కాదన్నారు. ఆయన ఒక్కడు చేసిన కృషి కారణంగానే టీడీపీ అధికారంలోకి రాలేదన్నారు.

ముఖ్యమంత్రి ప్రజాప్రతినిధులను నిర్లక్ష్యం చేస్తూ అధికారులపై ఎక్కువగా ఆధారపడుతున్నారని, ఈ వైఖరి మార్చుకోవాలని తాను అనేకసార్లు చెప్పానని అన్నారు. ఆయన కామెంట్స్‌కు చంద్రబాబు చిరాకు పడినా బయటపడిన దాఖలాలు లేవు. కాని ఒకసారి బాబుకు కోపం వచ్చి ‘లూజ్‌ టాక్‌ సహించను’ అని హెచ్చరించారు. అయినా ఈ అనంతపురం నాయకుడు పట్టించుకుంటాడా?