ఏపీ చరిత్రలో ప్రథమం : ప్రతిపక్షమే లేదిక!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు మళ్లీ ఎన్నికలు జరగడానికి ఇంకా ఏడాదిన్నర వ్యవధి ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ఇవాళ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండేట్లయితే.. రాబోయే ఏడాదిన్నర రోజుల్లో ఏనాడూ.. వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శాసనసభలో అడుగుపెట్టబోయేది ఉండదు. ఇక తెలుగుదేశానిక పండగే పండగ. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కనీసం అడిగే దిక్కు లేదు.

శాసనసభ రికార్డుల్లో వారి నిర్ణయాలను ప్రశ్నించడం అంటూ ఒక్క ఆనవాలు కూడా కనిపించదు. చంద్రబాబునాయుడు కేబినెట్ ఎలాంటి నిర్ణయాలు అయినా తీసుకోవచ్చు. వాటిని ఆమోదించాల్సిన శాసనసభలో కేవలం అధికార పక్షం మాత్రమే ఉంటుంది. బిల్లు పెట్టగానే సభ్యుల భజన ప్రసంగాలు ఉంటాయి. ఆ వెంటనే ఏకగ్రీవంగా సభామోదం ఉంటుంది. అలా రాబోయే ఏడాదిన్నర పాలన సాగిపోతుంది.

జగన్ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారనడానికి సరైన హేతువు లేదు. గురువారం జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ ఎల్పీ సమావేశంలో అంతా కలిసి ఓ నిర్ణయం తీసుకున్నారు. తమ పార్టీ తరఫున గెలిచి ప్రభుత్వంలో అధికారం వెలగబెడుతున్న నలుగురు మంత్రుల్ని, ఫిరాయించిన 20 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించి వేటు వేస్తే తప్ప.. శాసనసభలో తాము అడుగుపెట్టబోయేది లేదని వారు తేల్చిచెప్పారు. ఎల్పీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని… డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు.

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ప్రభుత్వం చర్య తీసుకోవడం అనేది కల్లోమాట. అది వైసీపీకి తెలియని సంగతి కాదు. ఆ నేపథ్యంలో వైసీపీ లో మిగిలిన ఎమ్మెల్యేలు రాబోయే ఏడాదిన్నర రోజులూ అసెంబ్లీకి వెళ్లకుండా ఉండే పరిస్థితి ఏర్పడిందన్నమాట.

పెద్దిరెడ్డి నిజానికి ప్రభుత్వానికి ఏదో హెచ్చరిక చేస్తున్నట్లుగా ఈ మాటలు చెప్పారు గానీ.. వీరు సభకు రాకపోతే.. ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటుంది. వీరిని బుజ్జగించి పిలిపించుకుని.. వీరి డిమాండ్ల మేరకు నిర్ణయాలు తీసుకోవడానికి వీరేమీ పవన్ కల్యాణ్ లాంటి అనుకూల నాయకులు కాదు కదా అని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వంతో ఎన్ని తగాదాలు అయినా పడవచ్చు గానీ, పోరాటాలు చేయవచ్చు గానీ.. శాసనసభకు వెళ్లకుండా ఉండిపోవడం అనేది మాత్రం సమర్థనీయం కాదని వైసీపీలోనే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కానీ ఏంచేయగలరు.. అధినేత నిర్ణయం అయిపోయింది.. అందరూ దానిని అనుసరించడమే.