ట్వింకిల్‌ ఖన్నా.. ఎందుకిలా చేశావ్‌.!

కొన్ని పేజీలు కలిస్తే ఓ పుస్తకం. అలాంటి పుస్తకం బైబిల్‌ కావొచ్చు, ఖురాన్‌ కావొచ్చు, భగవద్గీత కావొచ్చు.. మరేదైనా కావొచ్చు. పుస్తకాన్ని దైవంతో సమానంగా భావిస్తాం. ఎందుకంటే పుస్తకం జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి.! కానీ, పుస్తకాన్ని ఓ సాధారణ వస్తువుగా భావిస్తే ఎలా.?

కొందరు మేధావులు గుడిలో లింగానికి కొత్త అర్థాలు చెబుతారు. ‘మతి’ ఎక్కువైపోయో, ‘మతి’ లేకనో ఆ వ్యాఖ్యలు చేసి, జనం నుంచి ఛీత్కారాల్ని ఎదుర్కోవడం చూస్తూనే వున్నాం. పుస్తకాన్ని పూజించడం మూఢత్వం కాదు. జ్ఞానాన్ని ప్రసాదించే పుస్తకాన్ని గౌరవించడం. అది తెలిస్తే, ట్వింకిల్‌ ఖన్నా, తాను చేసిన పనిని సమర్థించుకుని వుండేది కాదు.

ట్వింకిల్‌ ఖన్నా తెలుగు సినీ ప్రేక్షకులకీ సుపరిచితురాలే. ఆమె తెలుగులో వెంకటేష్‌ సరసన ‘శీను’ అనే సినిమాలో నటించింది. బాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించిన ట్వింకిల్‌ ఖన్నా, బాలీవుడ్‌ హీరో అక్షయ్‌కుమార్‌ని పెళ్ళాడిన విషయం విదితమే. ఆమె రచయిత్రి కూడానండోయ్‌. ఈ మధ్యనే ఓ ఫొటోసెషన్‌ కోసం పుస్తకాల్ని కిందేసుకుని కూర్చుంది. ఆమె కాలికి అతి దగ్గర్లో (కాలి కింద, పక్కన) పుస్తకాలున్నాయి. అదిప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమెను కడిగి పారేస్తున్నారంతా.

దాంతో, తనను ట్రాలింగ్‌ చేస్తోన్నవారికి ట్వింకిల్‌ ఖన్నా క్లాస్‌ తీసుకుంది. ‘నేను కాలు పెట్టింది స్టూల్‌ పైన.. పుస్తకాల మీద కాదు.. పుస్తకాల మీద కూర్చున్నాను.. నిజమే, పుస్తకాల మీద పడుకుంటాను కూడా..’ అంటూ కహానీ చెప్పింది. అంతే, ‘నీకు అసలు కళ్ళు కన్పిస్తున్నాయా.? కాళ్ళ కింద ఆ పుస్తకాలేంటి.?’ అంటూ మళ్ళీ నెటిజన్లు విమర్శలు షురూ చేసేశారు.

కొంతమంది వివాదాల కోసం తాపత్రయపడే క్రమంలో ఇదిగో ఇలాంటి ఫొటోలతో, విపరీత వ్యాఖ్యలతో హల్‌చల్‌ చేయడం ఇటీవలి కాలంలో ట్రెండింగ్‌ అయిపోయింది. రచయిత్రి కూడా అన్పించుకున్న ట్వింకిల్‌ ఖన్నాకి ‘పుస్తకం విలువ’ తెలియదని ఎలా అనుకోగలం.?