ఓటు అడిగినప్పుడు విజయ్, ఇప్పుడు జోసెఫ్ విజయ్!

అప్పుడు అతడు విజయ్, దక్షిణాది ప్రముఖుడు.. ఇప్పుడు అతడు జోసెఫ్ విజయ్. క్రిస్టియన్.. ఒక్క సినిమాలో భారతీయ జనతా పార్టీ విధానాల మీద ఏదో కామెంట్ చేసేశాడని.. విజయ్ పై దుమ్మెత్తిపోస్తున్నారు కమలనాథులు, వీర బీజేపీ భక్తులు. మీద పడి రక్కేసేలా ఉన్నారు వీళ్లంతా. ఏ విషయంలో అయినా మోడీని కానీ, ఆయన విధానాలను కానీ ఎవరైనా విమర్శిస్తే వాళ్ల అంతు చూసేలా ఉన్నారు.

మాట్లాడిన మాటల గురించి కాదు… వాళ్ల కులమేంటి, మతమేంటి.. అనేదే వీళ్ల ప్రశ్న. ఆ విషయాలను ఆధారంగా చేసుకునే దాడి మొదలు! ఇలా తయారైపోయింది పరిస్థితి. ఇదే విజయ్ ని ఎన్నికల ముందు నరేంద్రమోడీ కలిశారు.. అప్పట్లో దక్షిణాదిన భారతీయ జనతా పార్టీ బలోపేతం కోసం, మోడీ ఇక్కడి సినిమా వాళ్లందరినీ తెగ మీట్ అయ్యాడు కదా! అదే సమయంలో విజయ్ తో కూడా మోడీ మీట్ అయ్యారు.

ఆ విషయాన్ని ఘనంగా ట్విటర్లో కూడా పోస్టు చేశారు. అప్పుడు విజయ్ పేరుని ‘విజయ్’ అనే రాశారు. అయితే ఇప్పుడు మాత్రం కమలనాథులు ‘జోసెఫ్ విజయ్’ అని స్ట్రెస్ చేస్తున్నారు! అతడు క్రిస్టియన్.. కాబట్టే మా విధానాలను విమర్శించాడు.. అంటున్నారు. ఇంత జ్ఞానాన్ని పంచుతున్నారు కమలనాథులు.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది.. ఈ వ్యవహారంతో కమలనాథులు ఎదురుదాడి చేసేస్తూ ఏదో సాధించేస్తున్నాం అనుకుంటున్నారు కానీ, అసలు తమకు ఏ మాత్రం జవసత్వాలు లేని తమిళనాడులో ఈ వ్యవహారాన్ని కెళుకుతూ… దేశమంతా కంపు రేపుకుంటున్నారు!