కండువా మారినా గుండెల్లో టీడీపీనే.!

తెలుగుదేశం పార్టీకి గుడ్‌ బై చెప్పిన రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీలోంచి వెళుతూ వెళుతూ తనతోపాటు దాదాపు 18 మంది ముఖ్య నేతల్ని రేవంత్‌రెడ్డి తీసుకెళ్ళడం ద్వారా, తెలంగాణలో టీడీపీకి ఆయన పూర్తిగా గండికొట్టినట్లయ్యింది.

రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్‌రెడ్డితో పాటు, సీతక్క, విజయరమణారావు, అరికెల నర్సారెడ్డి తదితరులు రాహుల్‌ సమక్షంలో, కాంగ్రెస్‌ కండువాల్ని భుజాన వేసుకున్నారు. టీడీపీని వీడే విషయమై వీరిలో ఒక్కొక్కరి నుంచి ఒక్కోతరహా స్పందన రావడం గమనార్హం. వేం నరేందర్‌రెడ్డి అయితే, టీడీపీని వీడటం చాలా బాధగా వుందనీ, కాంగ్రెస్‌లో చేరినా, తమ గుండెల్లో ఎప్పటికీ టీడీపీ వుంటుందని అంటున్నారు.

మరోపక్క, సీతక్క తీరు ఇందుకు భిన్నంగా వుంది. కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ టీడీపీ అనీ, అయితే ఆ టీడీపీని నాశనం చేయాలని చూస్తోన్న టీఆర్‌ఎస్‌తో కొందరు టీడీపీ నేతలు స్నేహాన్ని కోరుకుంటున్న దరిమిలా, తమకు ఇంకో అవకాశం లేకుండా పోయిందనీ చెప్పుకొచ్చారు.

ఇక, కాంగ్రెస్‌లో కొత్తగా రేవంత్‌ రెడ్డి పేరుతో గ్రూప్‌ క్రియేట్‌ అయ్యిందనీ, అది కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేయకపోగా, మరింత బలహీనం చేస్తుందని తెలంగాణలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి భావిస్తోంది. ఈ వాదనని తెలంగాణ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఖండించేస్తున్నారు. కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువనీ, రేవంత్‌ చేరికతో పార్టీ బలోపేతమవుతుంది తప్ప, గ్రూపు తగాదాలు వుంటాయన్న వార్తల్లో నిజంలేదని చెబుతున్నారాయన. రేవంత్‌, కాంగ్రెస్‌లో చేరడంతో టీఆర్‌ఎస్‌కి వెన్నులో వణకు మొదలయ్యిందన్నది ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వాదన.

ఇదిలా వుంటే, రాహుల్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన అనంతరం రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి మీడియా ముందుకొచ్చినా, మీడియాతో మాట్లాడలేదు. సాయంత్రం ప్రెస్‌మీట్‌లో మాట్లాడదామంటూ, ఉత్తమ్‌ మాట్లాడేశాక ఆయనతో కలిసి వెళ్ళిపోయారు రేవంత్‌రెడ్డి.

కొసమెరుపు: రేవంత్‌, టీడీపీని వీడి కాంగ్రెస్‌లోకి వెళ్ళడం వెనుక పెద్ద వ్యూహమే వుందనీ, రేవంత్‌ టీడీపీ కోవర్టుగానే కాంగ్రెస్‌లోకి వెళుతున్నారనే ఊహాగానాలకి బలమిచ్చేలా ఆయనకు అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్‌రెడ్డి, ‘పార్టీ మారినా తమ గుండెల్లో టీడీపీ ఎప్పటికీ వుంటుంది’ అని చెప్పడం.!