కమల్‌, రజనీ లేటు.. ఉప్పీదాదా ‘హాటు’

రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వస్తాడట.. కమల్‌హాసన్‌ కొత్త పార్టీ పెట్టబోతున్నాడట.. ఇలా తమిళనాట కమల్‌హాసన్‌, రజనీకాంత్‌ గురించి చాలా కాలంగా గాసిప్స్‌ విన్పిస్తున్నాయి. ఈ విషయంలో రజనీకాంత్‌తో పోల్చితే కమల్‌హాసన్‌ కొంత ముందడుగు వేసిన మాట వాస్తవం. అయితే, ఈ ఇద్దరి గురించీ పొలిటికల్‌ గాసిప్స్‌ ‘పాచిపోతున్నాయి’ అని చెప్పక తప్పదు.

కర్నాటకలోనూ ఓ హీరో వున్నాడు.. రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించాడు.. సోషల్‌ మీడియాలో కొన్నాళ్ళుగా జనాన్ని ‘తనవైపుకు తిప్పుకునేందుకు’ ప్రయత్నిస్తూ వచ్చాడు. చివరికి తన పార్టీ పేరుని ప్రకటించేశాడు. అతనే ‘ఉప్పీదాదా’. అదేనండీ, ఉపేంద్ర. తెలుగులో ‘కన్యాదానం’, ‘సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి’ తదితర సినిమాల్లో నటించిన ఉపేంద్ర, కన్నడలో స్టార్‌ హీరో అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.!

కర్నాటక ప్రజ్ఞావంత్‌ జనతా పక్ష (కెపిజెపి) ఉపేంద్ర పార్టీ పేరు. పార్టీ పేరుతోపాటు, ఎజెండానీ ఉపేంద్ర వెల్లడించేశాడు. అందరికీ విద్య, అందరికీ ఆరోగ్య భీమా, మౌళిక సదుపాయాలు, చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహం.. ఇలా చాలానే వున్నాయి ఉపేంద్ర రాజకీయ పార్టీ ఎజెండాలో ముఖ్యాంశాలు.

రాజకీయాల్లోకి సినీ ప్రముఖులు రావడం కొత్తేమీకాదు. తెలుగునాట స్వర్గీయ ఎన్టీఆర్‌, రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన విషయం విదితమే. తమిళనాట ఎంజీఆర్‌, జయలలిత రాజకీయ ప్రభంజనం సృష్టించారు. అలాగని, రాజకీయాల్లోకి వచ్చిన సినీ ప్రముఖులంతా ఆశించిన మేర సక్సెస్‌ అయ్యారనీ అనలేం. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించి, దాన్ని కాంగ్రెస్‌లో కలిపేశారు. పవన్‌కళ్యాణ్‌ జనసేన పార్టీని మూడున్నరేళ్ళ క్రితమే స్థాపించారు గానీ.. దాన్ని ఇంకా జనంలోకి తీసుకెళ్ళలేకపోయారు. తమిళనాట విజయ్‌కాంత్‌ పార్టీ ఏమయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

మరి, కర్నాటక రాజకీయాల్లో ఉపేంద్ర తనదైన ముద్ర వేస్తారా.? ఉపేంద్ర సినిమాలు ఊర మాస్‌ తరహాలో వుంటాయి.. తన సినిమాల ద్వారా రాజకీయ వ్యవస్థలోని లోటుపాట్లనీ, సమాజంలోని కుళ్ళునీ ‘ఎత్తి చూపడం’ ఉపేంద్రకి అలవాటే. మరి, రాజకీయాల సంగతేంటి.? వేచి చూడాల్సిందే.