కమల్‌, పవన్‌ – మధ్యలో కమలం.!

కొత్త రాజకీయ పార్టీతో సినీ నటుడు కమల్‌హాసన్‌ తమిళనాడు రాజకీయాల్లో హల్‌చల్‌ చేసేందుకు సిద్ధమవుతున్న విషయం విదితమే. తెలుగునాట సినీ నటుడు పవన్‌కళ్యాణ్‌ ఇప్పటికే కొత్త రాజకీయ పార్టీని పెట్టినా, దాన్నింకా జనంలోకి తీసుకెళ్ళలేదు. 2019 ఎన్నికల నాటికి అటు కమల్‌, ఇటు పవన్‌ రాజకీయ తెరపై తమ తమ పార్టీలతో సందడి చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

ఓ దశలో కమల్‌, బీజేపీతో పనిచేసేందుకు సిద్ధమేనని ప్రకటించినా, ‘నా రంగు కాషాయం మాత్రం కాదు’ అని అంతకు ముందు ఇచ్చిన స్టేట్‌మెంట్‌కే కట్టుబడి, బీజేపీపై సెటైర్లు దంచేస్తున్న విషయం విదితమే. 2014 ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చిన పవన్‌, ప్రత్యేక హోదా విషయమై బీజేపీ చేసిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ, బీజేపీకి ‘యాంటీ’గా మారిపోయారు. ఆ ‘యాంటీ’ అనేది, ఆ తర్వాత కాస్త తగ్గిందనుకోండి.. అది వేరే విషయం.

ఇక, కమల్‌ రాజకీయ పార్టీ విషయమై బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘రాజకీయాల్లోకి ఎవరైనా రావొచ్చు. కానీ, ఇతరుల్ని విమర్శించేటప్పుడు రాజకీయాల్లో తమ నైతికత ఎంత అనేది కూడా తమను తాము ప్రశ్నించుకోవాలి. మూడు నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్న కమల్‌, సభ్య సమాజానికి ఏం మెసేజ్‌ ఇవ్వదలచుకున్నారు.?’ అంటూ ప్రశ్నించేశారు.

ఆసక్తికరమైన విషయమేంటంటే, ఇక్కడ పవన్‌కళ్యాణ్‌పై విష్ణువర్ధన్‌రెడ్డి ఎలాంటి విమర్శలూ చేయకపోవడం. పవన్‌ చేసింది కూడా అదే.! ఇటీవలే పవన్‌, మూడో భార్య ద్వారా మొత్తంగా నాలుగో సంతానాన్ని ప్రపంచానికి పరిచయం చేశారండోయ్‌. సినీ నటులన్నాక, వారికీ వ్యక్తిగత జీవితం వుంటుంది. వారి జీవితం వారిష్టం.!

అయితే, ఇక్కడ ఎవరైనా గుర్తుంచుకోవాల్సింది ఆయా వ్యక్తుల, వ్యక్తిగత జీవితాలకు సంబంధించి ‘చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఏమైనా వున్నాయా.?’ అన్నదే ముఖ్యం తప్ప, ఇతరత్రా విషయాలు కానే కావు. కానీ, ఇక్కడా ‘నైతికత’ అనేదొకటి చర్చకు వస్తుంది. ‘నా పెళ్ళిళ్ళ గురించి మాట్లాడేవారి జాతకాల్ని బయటపెట్టానంటే..’ అని ఓ సందర్భంలో పవన్‌, తన మీద వచ్చిన విమర్శలకు కౌంటర్‌ ఇచ్చే ప్రయత్నం చేశారు. మరి, కమల్‌ కూడా అదే తరహాలో స్పందిస్తారా.?

ఏమోగానీ, బీజేపీ నేతలు కమల్‌ విషయంలో ఒకలా, పవన్‌ విషయంలో ఇంకోలా వ్యవహరిస్తుండడం విశేషమే. పవన్‌, బీజేపీకి దూరమైనా.. ఎలాగోలా పవన్‌ని అక్కున చేర్చుకోవచ్చన్న నమ్మకం ఇంకా బీజేపీలో వుందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలట.?