బోరు కొట్టిందా?.. సీరియస్‌గా వస్తోందా?

విజయశాంతి కాంగ్రెసు రాజకీయాల్లోకి మళ్లీ ఎంటరవుతున్నారనే వార్తలు ఈమధ్య తెలుగు టీవీ ఛానెళ్లలో వినబడుతున్నాయి. ఎన్నికలు ఏడాదిన్నరలో పడిన నేపథ్యంలో ‘కదలివచ్చిన కనకదుర్గ’ అన్నట్లుగా కదలిరాబోతున్నట్లు తాజాగా ప్రముఖ ఛానెల్‌ తెలియచేసింది. గత ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత మౌనంగా, అజ్ఞాతంలో ఉండిపోయిన ఈమె కొంతకాలం కిందట తమిళనాడు వెళ్లి అక్కడ ఆర్కే నగర్‌ ఉప ఎన్నికలో అన్నాడీఎంకేలోని శశికళ వర్గం తరపున చురుగ్గా ప్రచారం చేశారు. ఈమె హడావుడి చూసి తమిళ రాజకీయాల్లోకి వస్తుందేమోనని అక్కడివారికి అనుమానం కూడా కలిగింది.

తమిళనాడుకు వెళ్లిపోతుందని చాలా కాలం ప్రచారం జరిగినప్పటికీ పెదవి విప్పని ఈ మాజీ హీరోయిన్‌ అతి కష్టం మీద మౌనం వీడి తాను తెలంగాణ రాజకీయాల్లోనే ఉంటానని, తన రాజకీయ జీవితం ఈ రాష్ట్రంతోనే ముడిపడి ఉందని కొంతకాలం కిందట చెప్పారు. అనారోగ్యం కారణంగా రాజకీయాలకు దూరంగా ఉన్నానని, త్వరలోనే పునరాగమనం చేస్తానన్నారు. చిన్నాచితక అనారోగ్యాలు కలగడం సహజమే. కాని గత మూడేళ్లుగా బయటకు రానంత అనారోగ్యం ఏం కలిగిందో ఆమె చెప్పలేదు.

తాజా సమాచారం ప్రకారం ఆమె ఢిల్లీ వెళ్లి కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీని కలుసుకొని తాను మళ్లీ పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటానని, తనకు బాధ్యతలు అప్పగించాలని కోరారు. మూడున్నరేళ్లుగా పార్టీకి దూరంగా ఉన్న ఆమెకు బోరు కొట్టిందో, ప్రత్యామ్నాయం దొరకలేదో లేదా కాంగ్రెసులోనే సీరియస్‌గా పనిచేయాలని నిర్ణయించుకుందోగాని రాహుల్‌ని కలుసుకున్నారు. ఆయన త్వరలో తెలంగాణకు రాబోతున్నారు. ఆ సందర్భంలో ప్రచార కమిటీని నియమిస్తారని, కార్యవర్గంలో మార్పులుచేర్పులు చేస్తారని అనుకుంటున్నారు.

దీంతో విజయశాంతిలో కదలిక వచ్చివుండొచ్చు. ఇంకా మౌనంగానే ఉంటే తెరమరుగయ్యే ప్రమాదముందని భయపడివుండొచ్చు. కాంగ్రెసు నాయకులు ఇప్పటికీ ఆమెను పెద్ద నాయకురాలిగానే పరిగణిస్తున్నారు కాబట్టి టిక్కెట్టు ఇవ్వడానికి అభ్యంతరం ఉండకపోవచ్చు. యూపీ ఎన్నికల సమయంలో కాంగ్రెసుకు వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్‌ కిషోర్‌ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెసు అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిని మార్చి మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌ను నియమించాలని చెప్పారని అప్పట్లో ఓ కథనం వచ్చింది. అధ్యక్ష పదవి కోసం అజర్‌తోపాటు మల్లు భట్టి విక్రమార్క, గీతా రెడ్డి, డీకే అరుణ, షబ్బీర్‌ అలీ మొదలైనవారి పేర్లు పరిశీలనకు వచ్చాయి. అదే సమయంలో విజయశాంతి పేరు కూడా పరిశీలించారట…!

పార్టీకి దూరంగా ఉన్న వ్యక్తి పేరు అధ్యక్ష పదవికి పరిశీలించారంటే టిక్కెట్టు ఇవ్వడానికి అభ్యంతరం ఏముంటుంది? కాంగ్రెసు నాయకత్వం ఆమెకు ప్రాధాన్యం ఇచ్చినా విజయశాంతి ప్రజలకు ఏం చెప్పుకుంటారనేది కీలక ప్రశ్న. గత ఎన్నికల తరువాత తాను ఎందుకు అజ్ఞాతంలో ఉందో చెప్పాలి. కాంగ్రెసు నాయకులు బతిమాలినా ఏ ఎన్నికల్లో ఎందుకు ప్రచారం చేయలేదో చెప్పాలి. రాజకీయాల్లో ఉన్నది పదవుల కోసమా? ప్రజా సేవ కోసమా? అనేది వివరించాలి.

ఆమె టీఆర్‌ఎస్‌ ఉన్న కాలంలోనే జనానికి కనబడలేదని విమర్శలు వచ్చాయి. ‘మా ఎంపీ కనబడటంలేదు’ అని ప్రజలు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వరంగల్‌ లోక్‌సభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగినప్పుడు కాంగ్రెసు నాయకులకు విజయశాంతి గుర్తుకు వచ్చి ప్రచార బృందంలో ఆమె తప్పనిసరిగా ఉండాలని అనుకున్నారు. కాని వారికి మౌనమే సమాధానమైంది. టీఆర్‌ఎస్‌ సర్కారు వైఫల్యాల మీద ఒక్కనాడూ మాట్లాడలేదు. విజయశాంతి అనే నాయకురాలు ఉందని ప్రజలు మర్చిపోతున్న దశలో మళ్లీ ట్రాక్‌ మీదికి రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు.