కమల్ రాజకీయం.. గౌతమి కొత్త ఆరోపణలు!

ఒకవైపు రాజకీయ నేత అవతారం ఎత్తాడు కమల్ హాసన్. కమల్ రాజకీయ నేతగా ఏ మేరకు రాణించగలడో ఇంకా తెలియదు. అయితే కమల్ కొత్త పార్టీని పెట్టడం మాత్రం జాతీయ మీడియా కూడా ప్రముఖంగా పేర్కొంది. ప్రస్తుతం తమిళనాట ఏర్పడిన రాజకీయ శూన్యతతో కమల్ రాణించగలడేమో.. అనే అభిప్రాయాలు కొంతమంది వ్యక్తం చేస్తూ ఉండగా.. మరోవైపు అంతగా మాస్ ఇమేజ్ లేని కమల్ రాజకీయాల్లో సాధించేది ఏమీ లేదనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి.

బ్రహ్మాండమైన మాస్ ఇమేజ్, ఒక కుల బలం కూడా కలిగిన చిరంజీవే రాజకీయంగా నిలదొక్కుకోలేకపోయాడు. ఇక కమల్ సాధించేది ఏమిటి? అనే విషయం కూడా ఆలోచించాల్సిన అంశమే. ఇక తమిళనాడు ఉదాహరణలే తీసుకున్నా.. మాస్ ఇమేజ్ కలిగిన కెప్టెన్ విజయ్ కాంత్ రాజకీయంగా ఫెయిల్ అయిన నేపథ్యంలో.. ఇక మళ్లీ హీరోలు రాజకీయాల్లోకి వచ్చి సాధించేగలిగేది ఏమిటీ అనేది కూడా ప్రశ్నార్థకమే.

ఒక తమిళ వెబ్ సైట్ ఈ మధ్యనే అంశంపై పోల్ నిర్వహించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ తమిళ హీరో రాజకీయ పరంగా తమిళనాడును కాపాడగలడు? అంటే… అందులో కమల్ పేరు చివరాఖరున వచ్చింది. రజనీకాంత్, అజిత్, కమల్ హాసన్, విజయ్ లతో పాటు.. స్టాలిన్, పన్నీరు సెల్వం వంటి వాళ్ల పేర్లను కూడా పొందుపరిచి నిర్వహించిన ఆ పోల్ కనీసం పన్నీరు వంటి వాళ్లతో కూడా కమల్ పోటీ పడలేకపోయాడు.

ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది మాత్రం అజిత్! రజనీకాంత్, విజయ్ ల కన్నా అజిత్ తరఫున ఎక్కువ మంది నిలిచారు ఆ సర్వేలో. ఇక ఆ సంగతలా ఉంటే.. రాజకీయాల్లోకి వచ్చిన కమల్ పై కొత్త ఆరోపణలు తెరపైకి తెచ్చింది ఇతడి మాజీ సహచరురాలు గౌతమి. కమల్ తో దాదాపు దశాబ్దకాలం పాటు సహజీవనం చేసిన గౌతమి ఇటీవలే వేరైన సంగతి తెలిసిందే.

ఇప్పుడు గౌతమి స్పందిస్తూ.. గతంలో తను కమల్ కోసం పనిచేశాను అని, అతడు నటించిన వివిధ సినిమాల కోసం క్యాస్టూమ్ డిజైనర్ గా పనిచేశాను అని.. కమల్ తనకు అందుకు సంబంధించిన డబ్బులు ఇవ్వలేదని అంటోంది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే.. ఈ అంశంపై ఇన్నాళ్లూ ఏం మాట్లాడని గౌతమి ఇప్పుడు మాట్లాడుతూ ఉండటం.

కమల్ తో ఆమె వేరుపడి కూడా చాలాకాలమే అయ్యింది. అయితే అప్పుడు తనకు కమల్ డబ్బులు ఎగ్గొట్టాడు అని చెప్పని గౌతమి ఇప్పుడు మాత్రం… కమల్ తనకు బాకీ పడ్డాడు అని, డబ్బులు అడిగితే ఇవ్వడం లేడు అని అంటోంది. గౌతమి ఆరోపణల్లో వాస్తవం ఉంటే ఉండవచ్చు. అయితే.. ఇప్పుడు ఈ అంశాలు తెరపైకి రావడమే విశేషం!