‘కమ్మకమ్మగా’ సినీ నందులు.!

ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోనే ‘నంది’ పురస్కారాల గౌరవం తగ్గిపోయింది. కాదు కాదు, తగ్గించేశారు. ఇంకెవరో కాదు, పాలకులే. తమకు నచ్చినవారికి ‘నందుల్ని’ ప్రకటించుకోవడం ద్వారా ‘నంది’ అవార్డుల స్థాయిని అప్పట్లోనే దిగజార్చేశారు. ‘కొనుక్కుంటే దొరుకుతాయిలే నందులు..’ అని పలువురు సినీ ప్రముఖులు పలు సందర్భాల్లో పెదవి విరిచిన విషయాన్ని ఎలా మర్చిపోగలం.?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలుగా ఒకప్పటి ఉమ్మడి తెలుగు రాష్ట్రం విడిపోయాక, ఆంధ్రప్రదేశ్‌ మాత్రం ‘నంది’ పేరుతో సినీ అవార్డుల్ని కొనసాగిస్తామని ప్రకటించింది. కమిటీల్ని కూడా నియమించింది. ఒకేసారి, మూడేళ్ళకు సంబంధించి నంది పురస్కారాల్ని ప్రకటించేశారు ఈ రోజు. షరామామూలుగానే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నందులపై పెదవి విరుపులు షురూ అయ్యాయి. సోషల్‌ మీడియా వేదికగా ఈ నందులపై పడ్తున్న సెటైర్లు అన్నీ ఇన్నీ కావు.

ప్రధానంగా ‘లెజెండ్‌’ సినిమాకి నందులు క్యూ కట్టడం విశేషమిక్కడ. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ నటించిన సినిమా కావడంతో, ఉత్తమ సినిమా, ఉత్తమ నటుడు, ఉత్తమ విలన్‌, ఉత్తమ దర్శకుడు.. ఇలా పలు కేటగిరీల్లో ఈ సినిమాకి నందులు పోటెత్తాయి. ఏపీలో చంద్రబాబు సర్కార్‌కి అవసరమైనప్పుడల్లా ఉపయోగపడ్తున్న దర్శకుడు బోయపాటి శ్రీనుకీ, ఉత్తమ దర్శకుడితోపాటు, బిఎన్‌రెడ్డి స్మారక పురస్కారాన్ని ప్రకటించడం గమనార్హం.

అన్నట్టు, ఈ నందులకు సంబంధించి ఈసారి మరో ఆసక్తికరమైన ‘కోణం’ బాగా ఎలివేట్‌ అవుతోంది. అదే ‘కమ్మ’ని యాంగిల్‌. సినీ పరిశ్రమలో ఆ సామాజిక వర్గానికి చెందినవారు ఎక్కువగా వున్నారన్నది నిర్వివాదాంశం. అలాగని, అవార్డుల్లోనూ ఆ ‘కోటా రిజర్వేషన్‌’ ఖచ్చితంగా పాటించెయ్యాలనుకుంటే ఎలా.? హీరోలు, దర్శకులు.. ఇలా వివిధ కేటగిరీల్లో ఈ ‘కోటా’ ప్రత్యేకంగా కన్పిస్తుండడంతో అంతా ముక్కున వేలేసుకుంటున్నారు.

అన్నట్టు, కమల్‌, రజనీకాంత్‌, రాఘవేంద్రరావు ఎన్టీఆర్‌ జాతీయ పురస్కారానికి ఎంపిక కాగా, కృష్ణంరాజు, చిరంజీవి, పబ్లిసిటీ ఈశ్వర్‌కి రఘుపతి వెంకయ్య స్మారక పురస్కారాల్ని ప్రకటించారు. నిర్మాత, దర్శకుడు, నటుడు.. ఇలా అధికార టీడీపీ, అన్ని విభాగాల్లోనూ తనదైన ముద్ర వేయడంతోపాటు, ‘కమ్మ’ని కోణం కూడా చూపించడంతో ఈసారి ‘కమ్మ’ని నందులు.. అని అనుకోకుండా వుండలేకపోతున్నారు సినీ ప్రియులు ‘నందుల’ ప్రకటన చూశాక.

శ్రీమంతుడు సినిమాకిగాను నంది అందుకునే అర్హత మహేష్ బాబుకి వున్నా, టీడీపీ కోటాలో అవార్డు వచ్చిందన్పించేలా చేశారు. ఎన్టీఆర్ సంగతి సరే సరి. బాలయ్య ’కోసం‘ ఏ స్థాయిలో నందులు ఫేవర్ చేశాయో అర్థమవుతూనే వుంది. ఈ ‘కమ్మ’ని సందట్లో కొన్ని మంచి సినిమాలకూ నందులు దక్కినా, ఆ సినిమాల విజయం ఈ రాజకీయ నందుల కారణంగా తగ్గిపోయిందని అనుకోవచ్చేమో.