కరోనాతో టాలీవుడ్‌కి చాలా చాలా నష్టమేగానీ.!

కరోనా వైరస్‌ దెబ్బకి ప్రపంచమే స్తంభించిపోతుంటే, సినీ పరిశ్రమ అందుకు మినహాయింపు ఎలా అవుతుంది.? మొత్తం భారతీయ సినీ పరిశ్రమ అంతా కనీ వినీ ఎరుగని రీతిలో సెలవులు తీసుకుంటోంది. ది¸యేటర్లను బంద్‌ చేశారు, షూటింగులు కూడా ఆగిపోయాయి. అయితే, ఈ పరిస్థితి ఎన్నాళ్ళు ఇలా కొనసాగుతుంది.? అన్నదే మిలియన్‌ డాలర్ల ప్రశ్న. ఏప్రిల్‌ మొదటి వారం నుంచి మళ్ళీ పరిస్థితి మామూలవుతుందనే చర్చ కొంత మేర జరుగుతున్నా, ఏప్రిల్‌ రెండో వారం దాటేవరకూ ఈ ‘బంద్‌’ కొనసాగవచ్చునన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

మరోపక్క, మే మొదటి వారానికి పరిస్థితి అదుపులోకి వస్తే అదే గొప్ప విషయం అనేవారూ లేకపోలేదు. ఇదిలా వుంటే, షూటింగ్‌లు ఆగిపోవడం, ది¸యేటర్లు మూతపడటంతో సినీ పరిశ్రమకు తీవ్ర నష్టమే వాటిల్లుతోంది. కానీ, ఏమీ చేయలేని పరిస్థితి. ప్రజారోగ్యమే కాదు, తమ ఆరోగ్యమూ కాపాడుకోవాల్సిన బాధ్యత సినీ పరిశ్రమలో ప్రతి ఒక్కరి మీదా వుంది. అందుకే, అందరూ స్వచ్చందంగా ముందుకొచ్చారు. సాధారణంగా సినీ జనాలకి కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకు తీరిక వుండదు.

ఇప్పుడు మాత్రం, కరోనా దెబ్బకి.. సినీ ప్రముఖులు తమ కుటుంబానికి చాలా చాలా ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తోంది. ఎందుకంటే, అంతా ఇంటికే పరిమితమవుతున్నారు మరి. ‘భయం వీడండి.. అవగాహనతో మెలగండి..’ అంటూ ఓ వైపు సోషల్‌ మీడియా ద్వారా ప్రచారం చేస్తూ, ఇంకో వైపు తమ ఫ్యామిలీ విశేషాల్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటున్నారు సెలబ్రిటీలు.

మెగాస్టార్‌ నుంచి ఓ సాధారణ కమెడియన్‌ దాకా.. అందరూ సోషల్‌ మీడియాని గతం కంటే ఇప్పుడు చాలా చాలా ఎక్కువగా వాడేసుకుంటున్నారు. అభిమానులకు అంతకన్నా కావాల్సిందేముంది.? ఈ హ్యాపీనెస్‌ ముందు, ‘కరోనా వల్ల కలిగిన ఆర్థిక నష్టం’ ఎక్కువేమీ కాదని సినీ ప్రముఖులే అభిప్రాయపడుతుండడం గమనార్హం. ఏదిఏమైనా, వీలైనంత తక్కువ సమయంలో కరోనా వైరస్‌ వ్యాప్తి ఆగిపోయి, పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చేసి.. అన్ని రంగాలూ తిరిగి ట్రాక్‌ మీదకు ఎక్కాలని ఆశిద్దాం.