నాగశౌర్య గురించి వెంకీ కుడుముల ‘మంచి’ మాటలు

అదేంటో నాగశౌర్య ఏమో.. తనతో పని చేసిన వాళ్ల మీద ఎలా పడితే అలా విమర్శలు చేస్తుంటాడు. కానీ అతడి నుంచి విమర్శలు ఎదుర్కొన్న వాళ్లు మాత్రం చాలా హుందాగా మాట్లాడి అతడి మాటలకు విలువ లేకుండా చేస్తుంటారు. ఇంతకుముందు సాయిపల్లవి విషయంలో ఇదే జరిగింది. ఆమెకు యాటిట్యూడ్ ఎక్కువని.. కోస్టార్లను లెక్క చేయదని తీవ్ర ఆరోపణలే చేశాడు శౌర్య.

సాయిపల్లవితో పడనందుకు ‘కణం’ సినిమా ప్రమోషన్లకే రాకుండా ఎగ్గొట్టి విమర్శలు ఎదుర్కొన్నాడతను. కానీ సాయిపల్లవి మాత్రం సినిమా ప్రమోషన్లలో శౌర్య గురించి చాలా మంచి మాటలు మాట్లాడింది. అతడితో గొడవ గురించి అడిగితే నవ్వి ఊరుకుంది. దీంతో శౌర్యకు వాయిస్ లేకుండా పోయింది. దర్శకుడు వెంకీ కుడుముల విషయంలోనూ ఇప్పుడు అదే జరుగుతోంది.

వెంకీ గురించి శౌర్య మరీ దారుణమైన కామెంట్లే చేశాడు. అతడిలో విషయం లేదని.. తనే ‘ఛలో’ కథ రాసి ఇచ్చి క్రెడిట్ తీసుకోలేదని.. సినిమా రిలీజ్ తర్వాత అతను తనను లెక్క చేయలేదని.. ఇలా ఎన్నో కామెంట్లు చేశాడు. వెంకీ గురించి అతను వాడిన పదాలు మీడియాలో రాయలేని విధంగా ఉన్నాయంటే తీవ్రత అర్థం చేసుకోవచ్చు. కానీ ఇదే విషయం వెంకీని ఇంతకుముందు అడిగితే హుందాగా స్పందించాడు. శౌర్య గురించి ఒక్క నెగెటివ్ కామెంట్ కూడా చేయలేదు. ఈ విషయంపై చర్చ అనవసరమన్నాడు.

‘భీష్మ’తో హిట్టు కొట్టి తన ప్రతిభను చాటుకున్నాడు. శౌర్య విమర్శలకు బదులిచ్చాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో అతను తన కెరీర్ ఎలా ఆరంభమైంది.. ఇక్కడిదాకా ఎలా వచ్చింది చెప్పుకొచ్చాడు. యోగి దర్శకత్వంలో శౌర్య చేసిన ‘జాదూగాడు’కు తాను దర్శకత్వ శాఖలో పని చేశానని.. అప్పటి పరిచయంతోనే తనకు దర్శకుడిగా తొలి అవకాశం ఇచ్చాడని.. తన కథ నచ్చి సొంతంగా బేనర్ పెట్టి మరీ తనను దర్శకుడిగా పరిచయం చేశాడని శౌర్య గురించి చాలా పాజిటివ్‌గా మాట్లాడాడతను. అతడి గురించి విమర్శలు చేయలేదు. తనపై చేసిన విమర్శల గురించీ ప్రస్తావించలేదు. వెంకీలోని ఈ హుందాతనం వల్ల శౌర్య మరింత పలుచన అయిపోతున్నాడన్నది వాస్తవం.