కరోనా ఎఫెక్ట్… ఏప్రిల్ 14 దాకా టోల్ లేదు

ప్రపంచ దేశాలను వణికించేస్తున్న కోవిడ్- 19 వైరస్ ఆయా దేశాల్లో సంచలనాలకే సంచలనాలుగా నిలుస్తున్న నిర్ణయాలు అమలయ్యేలా చేస్తోంది. ప్రాణాంతకంగా మారిన ఈ వైరస్ కారణంగా ఇప్పటికే భారత ప్రభుత్వం దేశంలో వచ్చే నెల 14 దాకా లాక్ డౌన్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. మంగళవారం రాత్రి ప్రధాని నరేంద్ర మోదీ మూడు వారాల పాటు దేశాన్ని లాక్ డౌన్ చేస్తున్నామని, వైరస్ ను పారదోలేందుకే తీసుకున్న ఈ నిర్ణయానికి అందరూ మద్దతు పలకాలని పిలుపునిచ్చారు.

మోదీ ప్రకటన వచ్చినంతనే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లోకి వచ్చేసింది. ఈ లాక్ డౌన్ ను ఆధారంగా చేసుకుని భారత జాతీయ రహదారుల ప్రాదికార సంస్థ(ఎన్ హెచ్ఏఐ) ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో లాక్ డౌన్ అమలులో ఉన్నంత కాలం వరకు… అంటే ఏప్రిల్ 14 వరకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టోల్ ప్లాజాలను మూసివేస్తున్నట్లుగా ప్రకటించింది.

ఎన్ హెచ్ఏఐ తీసుకున్న ఈ నిర్ణయం దరిమిలా… వచ్చే నెల 14 వరకు దేశంలోని ఏ ఒక్క టోల్ ప్లాజా వద్ద కూడా వాహనదారులు టోల్ చెల్లించాల్సిన అవసరం లేదన్న మాట. దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ప్రజా రవాణా దాదాపుగా స్తంభించిపోయింది. అయితే సరకు రవాణా నిలిచిపోవడం కుదరదు కదా. అదే సమయంలో అత్యవసరాలు ఉన్న ప్రజలు కూడా అదికార యంత్రాంగం అనుమతితోనే ప్రయాణాలు సాగించక తప్పదు కదా.

సరకు రవాణాతో పాటు అత్యవసర ప్రయాణాలు చేసే వారు తమ వాహనాలకు టోల్ చెల్లించాల్సిందే కదా. అయితే ఇప్పుడు ఎన్ హెచ్ఏఐ తీసుకున్న నిర్ణయంతో వీరంతా వచ్చే నెల 14 దాకా ఎలాంటి టోల్ చెల్లించకుండానే ప్రయాణాలు చేయొచ్చన్న మాట.