కాంగ్రెస్ లో కొత్త డౌట్ : రేవంత్ కోవర్టా?

కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కొత్త సందేహాలు కమ్ముకుంటున్నట్లుగా రాజకీయ వర్గాల్లో ఓ చర్చ షురూ అయింది. రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ చంద్రబాబునాయుడు తరఫున.. ప్లాంటర్ లాగా కాంగ్రెస్ పార్టీలోకి ప్రవేశిస్తున్న నాయకుడా? అనేదే ఆ సందేహం. ఇంకా ఓ మాట సీరియస్ గా చెప్పాల్సి వస్తే.. చంద్రబాబు కోవర్ట్ గానే.. రేవంత్ కాంగ్రెస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారా? అనే సందేహాలు కూడా వ్యాపిస్తున్నాయి.

ఈ కోణంలోంచి రేవంత్ మీద పితూరీలో సిద్ధంచేసి.. ఆయన రాకను వ్యతిరేకిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొందరు అధిష్టానానికి లేఖలు పంపుతున్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్న సందర్భంలో రేవంత్ రెడ్డి చంద్రబాబునాయుడుకు రాసిన లేఖలో.. ఆయనను పొగిడిన తీరు, చంద్రబాబునాయుడును కీర్తించిన శైలి మొత్తం ఈ సందేహానికి ఆధారాలుగా వారు అధిష్ఠానం దృష్టికి తీసుకువెళుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

రేవంత్ రెడ్డి సాధారణ పరిస్థితుల్లో తెలుగుదేశానికి ‘సింపుల్’గా రాజీనామా సమర్పించి ఉంటే ఎలాంటి అనుమానాలు సందేహాలకు తావుండేది కాదు. అయితే ఆయన తన ఆత్మకథ మొత్తం అందులో రాసేసి.. ఇప్పుడు ఈ చర్చకు తావిచ్చారు. చంద్రబాబునాయుడును ఆకాశానికి ఎత్తేస్తూ ఆ లేఖ రాశారు. చంద్రబాబునాయుడు అంటే తెలంగాణ కాంగ్రెస్ కు కూడా ఆగర్భ శత్రువు కిందే లెక్క. రేపొద్దున్న రేవంత్ రెడ్డికి పార్టీలో కీలక పదవిని కట్టబెడితే.. ఆయన కేవలం కేసీఆర్ మీదనే పోరాడతా.. చంద్రబాబును కీర్తిస్తూ ఉంటా అంటే కుదర్దు.

పైగా తెలంగాణలో రాష్ట్రస్థాయి కీలక పదవులు పొందిన తరువాత.. అవసరాన్ని బట్టి.. ఆంధ్రప్రదేశ్ కు కూడా వెళ్లి.. అక్కడ పార్టీని బలోపేతం చేసే బాధ్యతను కూడా రేవంత్ రెడ్డి భుజాల మీద పెట్టినా ఆశ్చర్యంలేదు. ఎందుకంటే.. ఏపీ కాంగ్రెస్ పార్టీలో మిగిలి ఉన్న నాయకుల కంటె.. రేవంత్ రెడ్డికి ఏపీ వ్యాప్తంగా కాస్త అంతో ఇంతో క్రేజ్ ఉన్నదనే సంగతి అందరికీ తెలుసు.

ఆ రకంగా రేవంత్ లాంటి చురుకైన నాయకుడు అందుబాటులోకి వచ్చిన తర్వాత.. అన్ని రకాలుగానూ పిండేసుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. అప్పుడు చంద్రబాబునాయుడును తిట్టంకుండానే రేవంత్ ఎలా చేయగలరు? రాజీనామా లేఖలోని అంశాల రేంజిలో చంద్రభక్తి ఉన్న నాయకుడు పార్టీకి దన్నుగా నిలిచేది నిజమేనా అనే సందేహాలు కాంగ్రెస్ లో పుడుతున్నాయి.