అదీ.. ఇదీ ఎలా సాధ్యం

రాజకీయ నాయకులు ఒక్కోసారి తెలివిగా, ఒక్కోసారి అర్థం లేకుండా మాట్లాడతారు. ‘తొందరపడి ఒక కోయిలా ముందే కూసింది’ అన్నట్లుగా పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోకముందే నోటికొచ్చింది చెబుతుంటారు. ఆ తరువాత వివాదాలు తలెత్తడం, అభాసుపాలు కావడం జరుగుతుంటుంది. తెలంగాణలో టీడీపీ వచ్చే ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలో నిర్ణయం కాలేదు. అధినేత చంద్రబాబు ఏమనుకుంటున్నారో తెలియదు. రేవంత్‌ రెడ్డి కాంగ్రెసుతో, మోత్కుపల్లి నర్సింహులు టీఆర్‌ఎస్‌ తో పొత్తు పెట్టుకోవాలన్నప్పుడు పొత్తుల గురించి ఎవ్వరూ మాట్లాడవద్దని, ఎన్నికల సమయంలో చర్చిద్దామని అన్నారు.

ఇంత స్పష్టంగా చెప్పిన తరువాత తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ ఓ అర్థంలేని ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ భావజాలానికి దగ్గరగా ఉండే పార్టీతో పొత్తు పెట్టుకుంటామన్నారు. ఇది ఓకే. కాని దీనివెంటనే ‘మొత్తం 119 స్థానాలకూ అభ్యర్థులను నిలబెడతాం’ అని చెప్పారు. ఇదెలా సాధ్యం? పొత్తయినా పెట్టుకోవాలి. ఒంటరిగానైనా పోటీ చేయాలి. కాని రమణ రెండు పనులూ చేస్తామంటున్నారు. పొత్తు పెట్టుకున్నప్పుడు అవతలి పార్టీకి కొన్నిసీట్లు ఇవ్వాలి కదా. అలాంటప్పుడు మొత్తం స్థానాలకు పోటీచేయడం సాధ్యంకాదు కదా.

కాని రమణ లాజిక్‌ లేకుండా మాట్లాడారు. అసలు టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి ఏ పార్టీ సిద్ధంగా ఉంది? దాని భావజాలం ఏమిటి? సిద్ధాంతం, భావజాలం… ఇలాంటివాటికి కాలం చెల్లింది. సిద్ధాంతాలు పట్టుకు వేలాడే కమ్యూనిస్టు పార్టీలే వాటిని వదిలేస్తుంటే బూర్జువా పార్టీలకు అవి ఉంటాయా? సిద్ధాంతాలు, విలువలు ఉంటే అక్రమంగా ఫిరాయింపులను ప్రోత్సహించరు కదా. ఏ పార్టీకైనా రాజకీయ ప్రయోజనాలే ప్రధానం. తెలంగాణలో టీడీపీని చాలావరకు టీఆర్‌ఎస్‌ పీల్చి పిప్పి చేసింది. కొద్దిగా మిగిలివుంటే దాన్ని ఖతం చేయాలని కాంగ్రెసు ప్రయత్నాలు ప్రారంభించింది.

రేవంత్‌ రెడ్డి కాంగ్రెసులో చేరగానే ఆ తరువాత పాతికమంది వరకు చేరతారని వార్తలొస్తున్నాయి. జిల్లాల్లో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులను, కార్యకర్తలను భారీగా చేర్చుకుంటామని నాయకులు చెబుతున్నారు. కాంగ్రెసు నేతల ప్రయత్నాలు ఫలిస్తే వైఎస్సార్‌సీపీ మాదిరిగా చిరునామ కరువైపోతుంది. రేవంత్‌ ఈనెల 31న హస్తం పార్టీలో చేరతాడని, అదే సమయంలో 30మంది వరకు చేరొచ్చని ప్రచారం జరుగుతోంది. పార్టీ పూర్తిగా బలహీనపడితే పొత్తుకు ఎవరు ముందుకొస్తారు? పార్టీకి మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఏం నిర్ణయం తీసుకుంటారో…!