కేసీఆర్ కలలకు మజ్లిస్ బ్రేకులేస్తోందా?

మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ.. అసెంబ్లీలో కీలకమైన వ్యాఖ్యలు చేశారు. వచ్చే 2019 ఎన్నికల్లో కూడా.. తెరాసా-మజ్లిస్ జమిలిగా రాష్ట్రంలో విజయం సాధిస్తాయని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని ఆయన జోస్యం చెప్పారు. నిజానికి గులాబీ పార్టీకి ఇది ఆనందదాయకమైన జోస్యం అని అందరికీ అనిపిస్తుంది. అధికారంలో ఉన్న పార్టీని మీరు మళ్లీ అధికారంలోకి వస్తారు అని చెప్పే జోస్యం కంటె గొప్పది ఇంకేముంటుంది. కానీ.. లోతుగా గమనించినప్పుడు కేసీఆర్ అభిమానులు అలా సంబరపడుతున్నట్లు లేదు.

తమ గులాబీ బాస్ కేసీఆర్ కలలకు ఒవైసీ మాటలు గండికొడుతున్నట్లుగా వారు భావిస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే.. ఇప్పుడు కేంద్రలోని మోడీ సర్కారుతో ఉండే మైత్రీ బంధాన్ని మరింత పదిలంగా మార్చుకుని వచ్చే ఎన్నికల తర్వాత మోడీ మళ్లీ గద్దె ఎక్కితే గనుక.. తెరాస ఎంపీలకు కూడా కేంద్ర మంత్రివర్గంలో చోటు సంపాదించుకోవాలని, అందుకు వీలుగా ఎన్నికల్లో కమలదళంతో కలిసి పోటీచేసినా పర్లేదనే ఆలోచన ఆ పార్టీలో కొందరికి ఉందని సమాచారం. పార్టీ అధినేత మనసులో కూడా.. కేంద్ర కేబినెట్ లో భాగం కాగలిగితే గనుక.. తన కుమార్తె కవితను కూడా కేబినెట్లో చూసుకోవచ్చుననే కోరిక ఉండొచ్చు.

తెరాస జమానాలో కేసీఆర్ కుటుంబ పాలన నడుస్తున్నదంటూ.. ఎన్ని విమర్శలు వస్తున్నా.. వారు జడుస్తున్నది లేదు.. ఖాతరు చేస్తున్నది లేదు. అలాగే కవితకు కేంద్ర కేబినెట్ బెర్తు దొరికితే గనుక.. తండ్రి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఉన్న ఇద్దరు పిల్లల్లో ఒకరు కేంద్రమంత్రి, ఒకరు రాష్ట్ర మంత్రి. వారెవ్వా.. అనిపించేలా తమ కుటుంబం వినుతికెక్కుతుందనే కోరిక వారిలో ఉండొచ్చు. అయితే కమలంతో దోస్తీకి.. ఇప్పుడు ఒవైసీ చెబుతున్న మాటలు విఘ్నంగా మారవా? అనేది పలువురిలో కలుగుతున్న సందేహం. ఒకే ఎన్నికల్లో అటు కాషాయ పార్టీతోనూ, ఇటు మజ్లిస్ తోనూ బంధం కొనసాగించడం అసలు తెరాసకు సాధ్యమవుతుందా అని అనుమానిస్తున్న వారు కూడా లేకపోలేదు.

తెరాసా గత ఎన్నికల్లో కూడా అప్రకటితంగానే మజ్లిస్ తో పొత్తు వంటి బంధాన్ని కొనసాగించింది. ప్రభుత్వంలో వారికి చోటులేదు అనేమాట తప్ప.. భాగస్వామ్య పార్టీల్లాగానే వారు వ్యవహరిస్తుంటారు. వారి హవా సాగే చోట, తెరాస ఉనికి కోసం పాకులాడకుండా మిన్నకుంటూ సహకరిస్తుంటుంది. ఇలా ఇద్దరూ పరస్పరం సహకరించుకుంటున్న తరుణంలో.. వారి మైత్రి భవిష్యత్తులో అలాగే ఉంటుందా.. కొన్ని ప్రయోజనాల కోసం గులాబీ- కమలంతో కలుస్తుందా.. దాన్ని మజ్లిస్ సహిస్తుందా.. అనేవి వేచిచూడాలి.