కేసీఆర్ స్వప్నం ఇప్పట్లో తీరేలా లేదే!

తెలంగాణ రాష్ట్రం మాత్రమే కాదు.. నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉన్న భాగ్యనగరం మీద తనదైన ముద్ర శాశ్వతంగా ఉండాలని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఒక కోరిక ఉంది. అందుకే ఆయన ఐకానిక్ గా ఉండే భవనాలను నిర్మించి.. అందులో సచివాలయం లాంటివి నెలకొల్పి.. చరిత్రలో తన పేరు చిరస్థాయిగా ఉండిపోవాలని స్వప్నించారు.

అందుకు అనేక ప్రత్యామ్నాయాలు, ప్రయత్నాల తర్వాత.. ఒక తుదిరూపు తీసుకువచ్చారు. నేడో రేపో.. కొత్త సచివాలయానికి సంబంధించిన నిర్మాణ పనులు కూడా ప్రారంభం అయిపోతాయేమో.. అని అంతా అనుకుంటున్న వేళ తాజాగా వస్తున్న వార్తలు అనేక సందేహాలకు తావిస్తున్నాయి. కేసీఆర్ స్వప్నం ఇప్పట్లో తీరే అవకాశం లేదేమో అని పలువురు భావిస్తున్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రస్తుతం ఉన్న సచివాలయం ఎంతమాత్రమూ నచ్చలేదు అనే సంగతి అందరికీ తెలిసిందే. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఉన్న ఈ సచివాలయం కేసీఆర్ సుతరామూ నచ్చలేదు. ఈ సచివాలయంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారి వారసులు పుత్రరత్నాలు ఎవ్వరూ మళ్లీ సీఎం కాలేకపోయారన్న సెంటిమెంటు ఒకటి, వాస్తుదోషాల మీద నమ్మకం మరొకటిగా కలిసి.. కేసీఆర్ ఇటువైపు రావడమే మానుకున్నారు. మొత్తంగా ఈ నాలుగేళ్లలో ఆయన సచివాలయంలో అడుగుపెట్టిన సందర్భాలను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు.

మొత్తానికి కొత్త సచివాలయంగా ఓ ఐకానిక్ బిల్డింగ్ కట్టి.. తాను అక్కడినుంచి మాత్రమే పరిపాలన చేయాలనుకున్న కేసీఆర్.. సికింద్రాబాద్ లోని బైసన్ పోలో గ్రౌండ్స్ మీద కన్నేశారు. రక్షణశాఖ వారినుంచి ఆ స్థలం తీసుకోవడానికి చాలా ప్రయత్నాలే చేశారు. రక్షణశాఖకు నగరం వెలుపల చాలా విశాలమైన స్థలం కాంపెన్సేషన్ గా ఇస్తాం అని హామీ ఇచ్చి మొత్తానికి ఒప్పించారు. అయితే స్థలం అప్పగింతలు మాత్రం ఇంకా పూర్తి కాలేదు.

ఈలోగా ఇప్పుడొక అవాంతరం వచ్చిపడినట్లుగా కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా.. తమకు రాష్ట్ర అవసరాలకోసం రక్షణశాఖకు చెందిన స్థలాలు కావాలంటూ.. కేంద్ర ప్రభుత్వానికి కొత్తగా విజ్ఞప్తులు వచ్చాయిట. వాళ్లయితే ఏకంగా తమకు వందేసి ఎకరాల రక్షణ శాఖ స్థలం కావాలని అడుగుతున్నారుట.

ఇన్ని విజ్ఞప్తులు ఉన్నప్పుడు.. వాటిని తోసిపుచ్చి తెలంగాణకు మాత్రం స్థలం ఇస్తే.. గొడవ అయిపోతుందని.. అలాగని అందరూ అడిగినంత రక్షణ శాఖ స్థలాలను ఇచ్చుకుంటూ వెళితే ఇంకా పెద్ద గొడవ అవుతుందని.. కేంద్రం ప్రస్తుతానికి వ్యవహారాన్ని సస్పెన్స్ లో పెట్టింది. తెలంగాణ కొత్త సచివాలయానికి సంబంధించిన వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చినట్టే. పాతది నచ్చకపోతే.. కొత్త బిల్డింగు కట్టుకోవాల్సిందే తప్ప.. కొత్త స్థలం మాత్రం దొరక్కపోవచ్చునని పలువురు భావిస్తున్నారు.