తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌గా తెలంగాణ ఉద్యమంలో కోదండరామ్ ఎంత కీలక భూమిక పోషించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓ దశలో తెలంగాణ ఉద్యమం కేసీఆర్ చేతుల్లోంచి జారిపోతే, ఆ ఉద్యమాన్ని నడిపే బాధ్యతని పూర్తిగా కోదండరామ్ తీసుకున్నారన్నది నిర్వివాదాంశం. ఆ సమయంలోనే, తనను కోదండరామ్ డామినేట్ చేయడాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేకపోయారు. అలా అలా కేసీఆర్, కోదండరామ్‌ని ‘శతృవు’గా పరిగణించడం మొదలుపెట్టారు.. అదే శతృత్వం కొనసాగిస్తున్నారిప్పుడు.
ఇక, అసలు విషయానికొస్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణలో కోదండరామ్ ఇమేజ్‌ని వీలైనంతగా తగ్గించేందుకు కేసీఆర్ చాలా చాలా ప్రయత్నాలే చేశారు. అదే సమయంలో కోదండరామ్, తెలంగాణ జేఏసీ తరఫున పలు కార్యక్రమాలు చేపడుతూ తన ఇమేజ్‌ని పెంచుకుంటూ వచ్చారు. తెలంగాణలో విపక్షాలన్నీ విఫలమైన వేళ, మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూ వివాదంలో తెలంగాణ జేఏసీ తరఫున కోదండరామ్ పోరాడిన తీరు.. అప్పట్లో తెలంగాణ అంతటా హాట్ టాపిక్ అయ్యింది.
అంతే, ‘కోదండరామ్ రాజకీయాల్లోకి రావాలనుకుంటే వచ్చేయొచ్చు.. ఇలా జేఏసీ ముసుగులో రాజకీయాలు చేయడమేంటి.?’ అంటూ మాటల దాడిని తీవ్రతరం చేసింది కేసీఆర్ సర్కార్. అప్పటినుంచీ రాజకీయ రంగ ప్రవేశంపై కోదండరామ్ కిందా మీదా పడాల్సి వస్తోంది. తెలంగాణ జేఏసీలోనూ, ‘రాజకీయ అడుగులపై’ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. రాజకీయాల్లోకి రావాల్సిందేనంటూ కోదండరామ్‌పై ఒత్తిడి కూడా పెరుగుతోంది.
‘రాజకీయ పార్టీకి సంబంధించి జేఏసీలో చర్చ జరుగుతోంది.. ఒత్తిడి తీవ్రమవుతోంది..’ అంటూ ఇదివరకే ప్రకటించిన కోదండరామ్, తాజాగా మరోమారు రాజకీయ పార్టీ అంశంపై స్పందించారు. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామనీ చెప్పుకొచ్చారాయన. మరోపక్క, కాంగ్రెస్ పార్టీ కోదండరామ్‌ని తమవైపుకు తిప్పుకునేందుకు తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం చేసిందనుకోండి.. అది వేరే విషయం.
వివిధ రాజకీయ పార్టీలతో వివిధ పోరాటాలకు సంబంధించి టచ్‌లో వున్నా, తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌గా ఏ పార్టీతోనూ ‘లింకులు’ పెట్టుకోకుండా వుండడంతోనే కోదండరామ్, ఇప్పుడు ఓ బలమైన ఉద్యమ నాయకుడిగా గుర్తింపు పొందుతున్నారు. రాజకీయ పార్టీ పెట్టడమో, ఏదన్నా రాజకీయ పార్టీలో చేరితే.. ఇక అంతే సంగతులు. కానీ, తప్పదు.. ఒత్తిడి అలాంటిది. అంతర్గతంగా జేఏసీలో రాజకీయ పార్టీ విషయమై జరుగుతున్న ‘కొట్లాట’ ఇలా వుంటే, ‘కొలువుల కోసం కొట్లాట’ పేరుతో నిరుద్యోగుల కోసం కోదండరామ్ చేపట్టనున్న ఉద్యమం మాత్రం, కేసీఆర్ సర్కార్‌కి ఆల్రెడీ ఇబ్బందికరంగా మారిపోయింది.
చూద్దాం.. ముందు కొలువ కొట్లాట.. ఆ తర్వాత రాజకీయ కొట్లాట.. వెరసి, కోదండరామ్ రాజకీయ రంగ ప్రవేశం జరుగుతుందో లేదో.!