గుండు హనుమంతరావు ఇక లేరు

ప్రముఖ హాస్యనటుడు గుండు హనుమంతరావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గుండు హనుమంతరావు, ఈరోజు ఉదయం ఎస్ఆర్ నగర్ లోని ఆయన స్వగృహంలో కన్నుమూశారు.1956లో విజయవాడలో జన్మించిన గుండు హనుమంతరావు.. 4వందలకు పైగా చిత్రాల్లో నటించారు. జంధ్యాల, ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన సినిమాలతో ఆయన ఎక్కువగా పేరు తెచ్చుకున్నారు. జంధ్యాల తీసిన అహనా పెళ్లంట సినిమా గుండు హనుమంతరావు మొదటి చిత్రం. ఆ సినిమా ఆయనకు మంచి పేరు తీసుకొచ్చింది.

కొబ్బరిబొండాం, మాయలోడు, శుభలగ్నం, యమలీల, అహనా పెళ్లంట, పెళ్ళాం ఊరెలితే.. ఇలా ఎన్నో సినిమాల్లో “గుండు” హాస్యాన్ని మనం చూడొచ్చు. వీటితో పాటు టీవీ సీరియల్ అమృతం కూడా గుండు హనుమంతరావుకు ఎనలేని ఖ్యాతి తీసుకొచ్చింది. కొన్నేళ్లుగా కిడ్ని సమస్యతో బాధపడుతున్నారు ఈ హాస్యనటుడు. చికిత్స చేయించుకోవడానికి డబ్బులు కూడా లేని పరిస్థితి ఆయనది. ఈ విషయం తెలుసుకున్న అలీ స్వయంగా కొంత ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అలీ చేసిన ఓ షో ద్వారా విషయం తెలుసుకున్న చిరంజీవి కూడా ఆర్థిక సహాయం అందించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా చేయూతనిచ్చింది.

అలా కాస్త కోలుకున్న గుండు హనుమంతరావు ఈమధ్యే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లారు. అంతా మెరుగుపడిందనుకున్న సమయంలో రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే దగ్గర్లోని హాస్పిటల్ కు తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటికే గుండు హనుమంతరావు తుది శ్వాస వీడినట్టు వైద్యలు ప్రకటించారు.