గ్రహణ సమయంలో ఫంక్షన్లు

దేశం అంతా చంద్ర చంద్ర గ్రహణం అంటూ ఊగిపోతోంది. వాట్సప్ పుణ్యమా అని అసలు గ్రహణం అంటే ఏమిటి? ఏయే నక్షత్రాలకు మంచిది? ఎవరికి మంచిది కాదు, ఎవరికి కష్టం? ఎవరికి లాభం? ఇలాంటివి అన్నీ తెలిసిపోయాయి. గ్రహణం ఎన్నింటికి ప్రారంభం అవుతుంది? ఎన్నిటికి పూర్తిగా వుంటుంది? ఎన్నింటికి విడుస్తుంది కూడా తెలిసిపోయింది.

సాధారణంగా గ్రహణ సమయంలో కార్యక్రమాలు ఏవీ చేపట్టరని అంటారు. కేవలం మంత్ర విద్యలు నేర్చుకునేవారు మాత్రం నదుల్లో మునిగి నేర్చుకుంటారని అంటారు. అవన్నీ ఏమో కానీ, టాలీవుడ్ లో మాత్రం మూడు కీలక కార్యక్రమాలు గ్రహణ సమయంలోనే ఏర్పాటు కావడం విశేషం.హీరో నాని స్వంతంగా నిర్మిస్తున్న అ! సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రహణ సమయంలో సాయంత్రం సరిగ్గా ఆరున్నరకి జరుగుతోంది. ఈ ఫంక్షన్ కు ఇండస్ట్రీలోని సెలబ్రిటీలు చాలా మంది వస్తున్నారు.

అలాగే హీరో నిఖిల్ కిర్రాక్ పార్టీ వన్ మినిట్ టెన్ సెకెండ్స్ టీజర్ కూడా ఈ సాయంత్రమే లాంఛ్ చేస్తున్నారు. ఈ ఫంక్షన్ సాయంత్రం నాలుగున్నర నుంచి ఐదు గంటల ప్రాంతంలో ప్రారంభం అవుతుంది. అంటే అదీ గ్రహణ ప్రారంభ సమయంలోనే అన్నమాట.ఇక ముగ్గురు నిర్మాతలు భోగవిల్లి ప్రసాద్, దిల్ రాజు, సి కళ్యాణ్ కలిసి 9న సినిమాల విడుదలపై సంయుక్తంగా ఓ ప్రెస్ మీట్ ను హోల్డ్ చేయబోతున్నారు. ఇది కూడా సాయంత్రం నాలుగు గంటల సమయంలోనే.

మొత్తానికి సినిమా జనాలకు గ్రహణ సమయం అచ్చి వస్తుందేమో?