గ్రాండ్ గా చైతూ, సమంత రిసెప్షన్

మొత్తానికి పెళ్లయిన నెల రోజులకు వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటుచేశాడు నాగార్జున. సినీ, రాజకీయ ప్రముఖుల్ని ఆహ్వానించి భోజనాలు పెట్టాడు. గత నెల 6, 7తేదీల్లో గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు చైతన్య, సమంత. ఆ తర్వాత వారం రోజుల్లో పెట్టాల్సిన రిసెప్షన్.. ఇలా నెల రోజుల తర్వాత ఏర్పాటుచేశాడు నాగ్.

నాగచైతన్య, సమంత వెడ్డింగ్ రిసెప్షన్ కు సినీ రంగానికి చెందిన దాదాపు ప్రముఖులంతా హాజరయ్యారు. కృష్ణంరాజు, కృష్ణ, చిరంజీవి, హరికృష్ణ లాంటి సీనియర్లతో పాటు చైతూ, సమంత బెస్ట్ ఫ్రెండ్ రామ్ చరణ్ కూడా హాజరయ్యాడు. చెర్రీతో పాటు బన్నీ, నాని కూడా వచ్చారు.

ఇక దర్శకుల్లో రాజమౌళి, కొరటాల శివ, బోయపాటి శ్రీను, సుకుమార్, కల్యాణ్ కృష్ణ, మారుతి, చందు మొండేటి ఈ వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరయ్యారు. దగ్గుబాటి హీరోలైన రానా, వెంకటేష్ తో పాటు మొత్తం దగ్గుబాటి కుటుంబసభ్యులంతా ఈ వేడుకకు వచ్చారు.

ఇక వెడ్డింగ్ రిసెప్షన్ లో కూడా హీరో అఖిల్ సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచాడు. రిసెప్షన్ కు వచ్చిన ప్రతి ఒక్కరు అఖిల్ తో మాట్లాడకుండా వెళ్లలేదు. చాలామంది సెల్ఫీలు కూడా దిగారు. రిసెప్షన్ సందర్భంగా నాగచైతన్య, సమంతతో పాటు అక్కినేని కుటుంబమంతా కలిసి దిగిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.