చంద్రబాబు రుణం తీర్చుకున్న ‘నల్లారి’

ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి అందరికీ గుర్తుండే వుంటారు. ఆ తర్వాత ఆయన ‘జై సమైక్యాంధ్ర’ అనే పార్టీ పెట్టడం, ఆ తర్వాత రాజకీయ తెరపైనుంచి కనుమరుగైపోవడం తెల్సిన విషయాలే. ముఖ్యమంత్రిగా నల్లారి పనిచేస్తున్న సమయంలో, అప్పటి ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ పూర్తిస్థాయిలో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి మద్దతిచ్చిన విషయాన్ని ఎలా కాదనగలం.?

ఓ సందర్భంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చే అవకాశం టీడీపీకి వచ్చినా, ‘జాలి చూపి’ ఆ అవకాశాన్ని వదిలేసుకుంది టీడీపీ. తద్వారా, నల్లారి ప్రభుత్వాన్ని కాపాడిన పార్టీగా టీడీపీ రికార్డులకెక్కింది. ‘తుపాన్లను ఆపలేం.. విభజనను మాత్రం ఆపగలం..’ అని మీసం మెలేసిన నల్లారి, 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకాన్ని చంద్రబాబు సాయంతో ఎలా నట్టేట్లో ముంచేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

అది గతం.. ఇప్పుడు ప్రస్తుతంలోకి వస్తే, ఆ పాత మిత్రులు ఒక్కటవుతున్నారు. చంద్రబాబు పంచన చేరేందుకు నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి అండ్‌ టీమ్‌ రంగం సిద్ధం చేసుకుంటోంది. నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిని కలిశారు. టీడీపీలో తాను, తన సోదరుడు చేరబోతున్న విషయాన్ని చంద్రబాబుకి చెప్పారు నల్లారి కిషోర్‌. నల్లారి బ్రదర్స్‌ చేరికతో, టీడీపీ మరింత బలోపేతమవుతుందని కొందరు టీడీపీ నేతలు అంటున్నారు. అవునా.? నిజమా.? అని టీడీపీలోనే కొందరు నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండడం గమనార్హం.

మొత్తమ్మీద, తాను ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో.. తనకు కష్టకాలం ఎదురైతే ఆదుకున్న చంద్రబాబు రుణం, నల్లారి ఇప్పుడిలా తీర్చుకుంటున్నారన్నమాట. అదే సమయంలో, పాతమిత్రుడ్ని చంద్రబాబు సాదరంగా టీడీపీలోకి ఆహ్వానిస్తున్నారన్నమాట. ఈక్వేషన్‌ అదిరింది కదూ.!