తెదేపాలోకి మరో సినీ మహిళా సెలబ్రిటీ!

తనకు విపరీతమైన రాజకీయ ఆసక్తి ఉన్నప్పటికీ ఏదో అవకాశాలు లేక కేవలం ఇంటి వ్యవహారాలకు సినీ ప్రొడక్షన్ వ్యవహారాలకు పరిమితమవుతున్న మాజీ హీరోయిన్ నటి జీవిత. ఈమె దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలకు ఒక వరుస చుట్టబెట్టేసారు. ప్రతి పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీని నెత్తిన పెట్టుకోవడం.. తిరిగి ఆ పార్టీ తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వట్లేదంటూ పార్టీ నుంచి బయటకు వచ్చి పార్టీ మీద రాళ్లు వేయడం ఇది జీవిత- రాజశేఖర్ దంపతులకు నిత్యకృత్యంగా మారిపోయింది.

ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న పార్టీలను గమనించినా భాజపా లోనూ.. వైకాపా లోనూ.. గతంలో ఎంతో చురుకైన పాత్ర పోషించి బయటకు వచ్చిన వాళ్లే.

అయితే తాజాగా తెలుగు దేశం పార్టీకి ఉన్న అవసరాలను బట్టి.. తనకు ఉన్న రాజకీయ అవసరాలను బట్టి.. నటి జీవిత చంద్రబాబు దళంలో కీలక భూమిక పోషించడానికి అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

వైకాపా నుంచి అంతో ఇంతో సినిమా క్రేజ్‌తో పాటూ ధాటిగా విమర్శలు చేయగల దూకుడైన నాయకురాలిగా రోజాను ఎదుర్కోవడం తెలుగుదేశం పార్టీకి తలకుమించిన పనిగా అయిపోతోంది. రోజాకు ధీటుగా విమర్శలు చేయగల అందులో కొంతైనా సినిమా క్రేజ్ ఉన్నటువంటి నాయకురాలు తెలుగుదేశం పార్టీలో లేరు.

అంతో ఇంతో ఇటీవలే కేరళకు చెందిన వాణీ విశ్వనాధ్‌ను తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నప్పటికీ.. ఆమె ద్వారా ముందు ముందు పార్టీకి ప్రధానంగా రోజాను ఎదుర్కోకోవడానికి ఎంత మేరకు ప్రయోజనం ఉంటుందనే క్లారిటీ ఆ పార్టీ నాయకులకే లేదు. వచ్చీ రానీ తెలుగులో వాణీ విశ్వనాధ్ మాట్లాడుతుంటే.. రోజాను ఎదుర్కోవడం ఎంత వరకు సాధ్యమవుతుందని కూడా వాళ్లు తమలో తాము తర్కించుకుంటున్నారు. అలాంటి నేపధ్యంలో నటి జీవిత తెలుగుదేశంలో చేరడానికి సంకేతాలు పంపిస్తున్నట్లుగా ఉంది.

పైగా తాజాగా తన భర్త హీరో రాజశేఖర్ చేసిన గరుడ వేగ సినిమా అతి పెద్ద విజయం సాధించడం అనేది అమెకు తిరిగి ఆమె రాజకీయ పూర్వ వైభవాన్ని వెనక్కి తెచ్చుకోవడానికి బాటలు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది. హిట్ సినిమా హీరో భార్యగా రాజకీయాల్లో కూడా అవకాశాలు మెరుగ్గా ఉంటాయనే ఉద్దేశంతో జీవిత ఇప్పుడు అధికార పార్టీ వైపు అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తుంది. నంది అవార్డుల కమిటీలో ఉన్న జీవిత.. ఆ ప్రకటన సందర్భంగా చంద్రబాబును కలిసినపుడు రాజశేఖర్ నటించిన గరుడవేగ సినిమాని చూడాల్సిందిగా ఆయనను అభ్యర్ధించడం.. ఇవన్నీ కూడా వార్తల్లో వచ్చాయి.

అయితే తెలుగుదేశం పార్టీలో చేరడానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుతో నటి జీవిత మాట్లాడినట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. ఆమె కూడా వచ్చి పార్టీలో చేరితే గనుక అంతో ఇంతో రోజాను ఎదుర్కోవడానికి కనీసం ఇద్దరు మహిళా సినీ సెలెబ్రిటీలు తమ పార్టీలో అందుబాటులో ఉంటారని తెలుగుదేశం నాయకులు భావిస్తున్నారు.