చంద్రబాబు లేకుండానే పోలవరం కథ తేలుస్తారా?

పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తు ఏమిటో తేల్చేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక సమావేశం నిర్వహించడానికి సిద్ధమైంది. రాష్ట్రప్రభుత్వం చెబుతున్న లెక్కలకు, ఆశిస్తున్న సహాయానికి, కేంద్రం ఇస్తున్న నిధులకు చెబుతున్న మాటలకు ఏ మాత్రం పొంతన లేకుండా సాగుతున్న వ్యవహారం ఇక ఒక కొలిక్కి రానుంది. అటో ఇటో ఫైనలైజ్ అవుతుంది.

కాకపోతే.. పోలవరం విషయంలో చాలా పట్టుదలగా ఉన్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పరోక్షంలోనే ఈ కీలక సమావేశం జరగబోతోంది. చంద్రబాబు లండన్ లో నార్మన్ అండ్ ఫోస్టర్స్ తో సమావేశంలో ఉండడానికి షెడ్యూలులో ప్లాన్ చేసుకున్న తేదీన ఇక్కడ ఢిల్లీలో పోలవరానికి సాయం అందించే విషయంలో తుది భేటీ నిర్వహించాలని కేంద్ర మంత్రి నిర్ణయించడం చాలా కీలకంగా కనిపిస్తోంది.

పోలవరంకు నిధులు రాబట్టే విషయంలో చాలా తగాదాలు నడుస్తున్నాయి. ప్రాజెక్టుకు నిధులు భరించాల్సిన కేంద్రం అనుమతులతో నిమిత్తం లేకుండా రాష్ట్రం ఇప్పటికే ఒకసారి అంచనాలు సవరించేసింది. ఇక్కడికే ఇది నానా గందరగోళం అవుతోంది. ఏకంగా కాంట్రాక్టరునే మార్చేయడం అనే దానిని కేంద్రం ఒప్పుకోవడం లేదు. మామూలుగా అయితే నిబంధనలు, ఒప్పందాల ప్రకారం.. కాంట్రాక్టరు పనుల నిర్వహణలో విఫలం అయితే.. అతణ్ని బ్లాక్ లిస్టు లో పెట్టడంతో పాటు, వారి నుంచి నష్ట పరిహారాన్ని వసూలు చేయడానికి కూడా వీలుంటుంది.

అయితే చంద్రబాబు ప్రభుత్వం ఇదేమీ మాట్లాడడం లేదు. ఏతావతా.. ట్రాన్స్ ట్రాయ్ కు లబ్ది చేకూర్చడానికే ప్రభుత్వం తాజాగా కాంట్రాక్టరును మార్చడం అనే పాట పాడుతున్నదా.. అనే సందేహాలు కూడా కొందరిలో కలుగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో కాంట్రాక్టరు మార్పు అనేది అసాధ్యం, ఒప్పుకోం అని గడ్కరీ తేల్చేసిన తర్వాత.. తమ పాచిక పారకపోయే సరికి చంద్రబాబునాయుడు అమెరికాకు బయల్దేరే హడావిడిలోనూ నాగపూర్ కు అర్జంటుగా వెళ్లి గడ్కరీతో భేటీ అయి మాట్లాడారనే ప్రచారం జరుగుతోంది.

చంద్రబాబు అంత ప్రయత్నం చేసినా.. గడ్కరీ నుంచి నిర్దిష్టమైన హామీ రాలేదు. మీకు కాంట్రాక్టరును మార్చడం ముఖ్యమా.? పనులు జరగడం ముఖ్యమా? అని గడ్కరీ నిలదీసేసరికి ముఖ్యమంత్రికి నోట మాటరాలేదని సమాచారం. పనులు త్వరగా జరిగేలా ఎలా చేయాలో తేలుస్తాం , 24 న అందుకు సమావేశం నిర్వహిస్తాం అని గడ్కరీ ముక్తాయించారు. కాకపోతే.. కేంద్రం ఎలాంటి ప్రత్యామ్నాయం చెప్పినా పనులు జరిగితే చాలు అని బాబు అంటుండడంలోనే.. బాబు చెప్పిన ప్రత్యామ్నాయాలకు కేంద్రం నో చెప్పిందని అర్థమైపోతోంది.

24న భేటీ అంటే.. అప్పటికి చంద్రబాబు లండన్ లో ఉంటారు. ఆయన నేరు గా పాల్గొనకుండా పోలవరం కీలక భేటీ జరిగిందంటే.. కేంద్రం నిర్ణయాలకు కనీసం అడ్డుచెప్పి ఆలోచించాల్సిందిగా కోరేంతటి నాయకులు కూడా మనకు లేరు. చంద్రబాబు పరోక్షంల మీటింగ్ జరిగితే ఖచ్చితంగా పోలవరానికి అన్యాయమే జరుగుతుందని.. కేంద్రం ఏం చెబితే అది వినాల్సిందే అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.