బుట్టా రేణుకకి పదవీ భయమట

నంద్యాల ఎంపీ ఎస్‌పీవై రెడ్డి, ఎంపీగా పదవీ ప్రమాణ స్వీకారం చేయముందే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి జంప్‌ చేసేశారు. అరకు ఎంపీ కొత్తపల్లి గీత కూడా వైఎస్సార్సీపీని వీడీ, తెలుగుదేశం పార్టీతో కలిసి కొన్నాళ్ళు నడిచారు. చిత్రమేంటంటే, ఎస్‌పీవై రెడ్డి, టీడీపీ కండువా కప్పుకున్నారుగానీ, కొత్తపల్లి గీత టీడీపీలో చేరలేదు. ఇప్పుడు మరో వైఎస్సార్సీపీ ఎంపీ బుట్టా రేణుక కూడా, కొత్తపల్లి గీత బాటలోనే అడుగులేస్తుండడం గమనార్హం.

ఎంపీ పదవి పోతుందన్న భయంతోనే బుట్టా రేణుక, టీడీపీలో చేరలేదనీ – చంద్రబాబు ప్రభుత్వానికి మద్దతు మాత్రమే ఇచ్చారని టీడీపీ అనుకూల మీడియా తేల్చేయడం విశేషమిక్కడ. కాదు కాదు దీపావళి తర్వాత, కర్నూలులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి, దాన్ని బల ప్రదర్శనకు వేదికగా మార్చేసి.. ఆ వేదిక సాక్షిగా చంద్రబాబు సమక్షంలో బుట్టా రేణుక టీడీపీ కండువాని భుజాన వేసుకుంటారన్నది ఇంకో వాదన.

టీడీపీ – బీజేపీ మధ్య సంబంధాలు సరిగ్గా లేవనీ, ఆ కారణంగా వైఎస్సార్సీపీ గనుక లోక్‌సభ స్పీకర్‌కి ఫిర్యాదు చేస్తే, బుట్టా రేణుక ఎంపీ పదవి పోవడం ఖాయమని టీడీపీ అనుకూల మీడియా లెక్కలేయడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. అదే నిజమైతే, ఎస్పీవై రెడ్డి ఎంపీ పదవి ఎప్పుడో పోయేది. కొత్తపల్లి గీత సంగతీ అంతే అయివుండేది. కానీ, అవి జరగలేదు. మరి, బుట్టా రేణుక ఎంపీ పదవి ఎలా ఊడిపోతుందట.? ఇది మిలియన్‌ డాలర్ల ప్రశ్నే.

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ నుంచి 21 మంది ఎమ్మెల్యేలు వైఎస్సార్సీపీని వీడి, టీడీపీలో చేరారు. అందులో ఒకరి మరణంతో ఉప ఎన్నిక వచ్చింది. మరో నలుగురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులూ దక్కాయి. ఇంత అనైతిక రాజకీయం ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యమేలుతున్నా, ‘క్లీన్‌ యూ’ సర్టిఫికెట్‌ ఇచ్చేసిన టీడీపీ అనుకూల మీడియా, బుట్టా రేణుక విషయంలో కొంత ‘విచిత్రంగా’ వ్యవహరిస్తుండడం కాస్త ఆలోచించాల్సిన విషయమే మరి.!