చాన్నాళ్లకు నలుపు తెలుపు చిత్రం

నలుపు తెలుపు చిత్రాల నుంచి గేవా కలర్, ఈస్టమన్ కలర్ మీదుగా డిజిటల్ వరకు వచ్చేసింది తెలుగు సినిమా. అప్పుడప్పుడు సరదాగా బ్లాక్ అండ్ వైట్ షార్ట్ ఫిలింలో, జస్ట్ రెండు మూడు నిమషాల ఫ్లాష్ బ్యాక్ సీన్లో బ్లాక్ అండ్ వైట్ లో చూడ్డమో తప్పించి, కాస్త ఎక్కువ లెంగ్త్ బ్లాక్ అండ్ వైట్ లో చూడడం అన్నది లేదు.

కానీ మహానటి సినిమా విషయం అలా కాదట. సినిమా ప్రారంభం ఇరవై నిమషాల వరకు బ్లాక్ అండ్ వైట్ లోనే నడుస్తుందని తెలుస్తోంది. నిజానికి సావిత్రి సినిమా జీవితం చాలా వరకు బ్లాక్ అండ్ వైటే. కానీ అంతా బ్లాక్ అండ్ వైట్ లో తీస్తే జనాలు చూడలేరు కదా? అందుకే సావిత్రి బాల్యం, సినిమాల్లోకి రావడం వరకు బ్లాక్ అండ్ వైట్ లో తీసి, ఆ పైన కలర్ లోకి సినిమాను తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

వినిపిస్తున్న సెన్సారు రిపోర్ట్ ప్రకారం, సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం స్టయిల్ లో కాస్త స్లో నేరేషన్ వుంటుందని తెలుస్తోంది. సినిమా క్లయిమాక్స్ మాత్రం చాలా బాగా వచ్చిందని, సావిత్రి మరణం, ఆ మరణం వైనాన్ని మధురవాణి పాత్రలో సమంత నెరేట్ చేయడం వంటి సీన్లు అద్భుతంగా పండాయని తెలుస్తోంది. సినిమా మొత్తానికి క్లయిమాక్స్ ఆయువుపట్టు మాదిరిగా వుంటుందని తెలుస్తోంది.

సినిమాలో లెజండరీ పాత్రలు ఎవరు ఏవి పోషించారో ఇప్పటికే బయటకు వచ్చింది. కానీ ఒక్క ఎన్టీఆర్ పాత్ర విషయంలోనే సస్సెన్స్ కొనసాగుతోంది. ఈ పాత్రను ఎవ్వరూ పోషించలేదని, డిజిటల్ పార్మాట్ లో చిత్రీకరించారని తెలుస్తోంది. మహానటి సినిమా ఈ బుధవారం విడుదలవుతోంది.