చిరంజీవి పేరుతో క‌రోనా చారిటీ.. కార‌ణం ఏంటంటే?

లాక్ డౌన్ కార‌ణంగా తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో కార్య‌క‌లాపాల‌న్నీ ఆగిపోవ‌డంతో తీవ్ర ఇబ్బందుల పాల‌వుతున్న కార్మికుల‌ను ఆదుకోవ‌డానికి చిరంజీవి నేతృత్వంలో విరాళాల సేక‌ర‌ణ మొద‌లుపెట్ట‌డం తెలిసిన సంగ‌తే. క‌రోనా క్రైసిస్ చారిటీ పేరుతో జ‌రుగుతున్న ఈ కార్య‌క్ర‌మం కోసం చిరంజీవి చారిట‌బుల్ ట్ర‌స్టు ద్వారా విరాళాలు సేక‌రించ‌డంపై కొంద‌రు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

ప‌రిశ్ర‌మ త‌ర‌ఫున జ‌రుగుతున్న కార్య‌క్ర‌మానికి చిరంజీవి ట్ర‌స్టు ద్వారా విరాళాలు సేక‌రించ‌డం ఏంట‌న్న చ‌ర్చ న‌డుస్తోంది. దీనిపై సినీ జ‌నాలెవ్వ‌రూ మాట్లాడ‌లేదు కానీ.. సోష‌ల్ మీడియాలో వేరే హీరోల అభిమానులు దీనిపై ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు. దీనిపై నంద‌మూరి బాల‌కృష్ణ నొచ్చుకున్న‌ట్లు కూడా ప్ర‌చారం జ‌రిగింది.

ఐతే దీని వెనుక అస‌లు కార‌ణం ఏంట‌న్న‌ది టాలీవుడ్ సీనియ‌ర్ నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ చెప్పారు. ఇప్పుడు లాక్ డౌన్ కార‌ణంగా అన్ని కార్య‌క‌లాపాలు ఆగిపోయాయ‌ని.. ప్ర‌భుత్వ కార్యాల‌యాలు కూడా పాక్షికంగా ప‌ని చేస్తున్నాయ‌ని.. ఈ స‌మ‌యంలో కొత్త‌గా క‌రోనా చారిటీ కోసం ట్ర‌స్టు పెట్టడం సాధ్యం కాలేద‌ని.. దీంతో చిరంజీవి ట్ర‌స్టు ద్వారా విరాళాల సేక‌ర‌ణ జ‌రుగుతోంద‌ని ఆయ‌న చెప్పారు.

ఇందుకు ముందు చిరు నిరాక‌రించార‌ని.. కానీ వేరే దారి లేక తామే ఆయ‌న్ని బ‌ల‌వంతంగా ఒప్పించామ‌ని ఆయ‌న చెప్పారు. సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొన్నాక *మ‌న‌కోసం* పేరుతో కొత్త‌గా ఓ ట్ర‌స్టు నెల‌కొల్పుతామ‌ని.. మున్ముందు సినీ ప‌రిశ్ర‌మ త‌ర‌ఫున విరాళాల సేక‌ర‌ణ‌, ఇంకేదైనా సేవా కార్య‌క్ర‌మాలు చేయాల‌న్నా కూడా దాని పేరు మీదే చేస్తామ‌ని త‌మ్మారెడ్డి వెల్ల‌డించారు