జట్టు అలిగితే… జగన్ కే నష్టం?!!

వెనకటికి ఎవరో చెరువు మీద అలిగి.. అందులోని నీటిని వాడడం మానేశాడని సామెత! అలా చేయడం వల్ల చెరువుకు కొత్తగా వచ్చే నష్టం ఏమిటి? నీటికి గతిలేక ఆ వ్యక్తి నష్టపోతాడు తప్ప! అర్థం లేని అలకల గురించిన నీతి ఇది…

ఇప్పుడు జగన్ పార్టీ వ్యవహారం కూడా అలాగే కనిపిస్తోంది. నవంబరులో జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకూడదని తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎక్కువ మంది భావిస్తున్నట్లుగా వైసీపీ ఎల్పీ ఉప నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. ఈ అసెంబ్లీ సమావేశాల్ని బహిష్కరించాలని అనుకుంటున్నట్లుగా ఆయన వెల్లడించారు. జగన్ తో భేటీలో ఎక్కువ మంది ఈ అభిప్రాయం చెప్పినట్లుగా ఆయన పేర్కొన్నార. జగన్ మాత్రం తన అభిప్రాయం చెప్పలేదని సమాచారం. 26న ఎటూ ఎల్పీ సమావేశం ఉంది గనుక.. ఆ రోజు తేల్చవచ్చునని అనుకుంటున్నారు.

అయినా ఇక్కడ జగన్ ఒక కీలక విషయాన్ని గమనించాల్సి ఉంది. చెరవు మీద అలిగితే నష్టం ఎవరికి? అసెంబ్లీ మీద అలిగితే నష్టం ఎవరికి? ఎవరు గైర్హాజరవుతారో.. వారు నష్టపోతారు తప్ప.. మరో ప్రయోజనం లేదు. ప్రజల సమస్యల మీద పోరాటం సాగించడానికి కూడా టైం లేని శ్రద్ధ లేని ఎమ్మెల్యేలుగా వారి మీద ఒక కొత్త ముద్ర వస్తుంది తప్ప.. సాధించేది ఏమీ ఉండదు.

మామూలుగా రాజ్యాంగం ప్రకారం అయితే ఎమ్మెల్యే అంటే కేవలం చట్టసభ సభ్యుడు మాత్రమే. అసెంబ్లీలో చట్టాల రూపకల్పన సమయంలో పాల్గొని తన అభిప్రాయాలు తెలిపి.. చట్టాలు సక్రమంగా ప్రజానుకూలంగా వచ్చేలా కృషి చేయడమే అతని ప్రాథమిక విధి. అంతే తప్ప.. నియోజకవర్గాల్లో అధికార్ల మీద దందాలు చేయడం కాదు. కానీ.. కాలక్రమంలో ఎమ్మెల్యే పదవి అంటే నియోజకవర్గం మీద రాజరికం అని ఫీలయ్యే దుర్గతి సమాజంలో దాపురించింది.

ఇదంతా పక్కన పెట్టినా సరే.. వైసీపీ ఎమ్మెల్యేలు, తమ మీద ప్రజలు ఉంచిన నమ్మకాన్ని, ప్రాథమిక బాధ్యతను విస్మరించే లాగా సభకు హాజరు కాకపోతే ఎలా? అది వారి పార్టీకే పరువు తక్కువ అని తెలుసుకోవాలి. తాను పాదయాత్ర చేయడంవల్ల, అసెంబ్లీకి వెళ్లకపోయినా ప్రజలు క్షమిస్తారు. అదే పార్టీ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీ కి వెళ్లకపోతే.. ప్రజలు చీదరించుకుంటారు. ఈ వ్యత్యాసాన్ని తెలుసుకోకపోతే.. జగన్ కే నష్టం జరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.