మాటల్తో నమ్మే రోజులుపోయాయి.. పటేల్ బ్రదర్!

గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో రాజకీయం చాలా రసవత్తరమైన మలుపులు తిరుగుతోంది. నరేంద్రమోడీ ప్రభావం వల్ల.. భాజపాకు కంచుకోటగా మారినట్లు ప్రచారంలో ఉన్న గుజరాత్ లో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ తాము పాగా వేయాలని కాంగ్రెస్ కూడా తపన పడుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాలేదు గానీ.. రాహుల్ గాంధీ ఇప్పటికే పలుమార్లు ఆ రాష్ట్రంలో పర్యటనలు పూర్తి చేశారు. భాజపా మీద వాడి విమర్శలతో విరుచుకుపడుతూ పార్టీని గెలిపించడానికి పాటుపడుతున్నారు.

ఈ నేపథ్యంలో ఆసక్తికరమైన ట్విస్టు చోటు చేసుకుంది. తాను పార్టీలో చేరితో కోటి రూపాయలు ఇస్తాం అంటూ భాజపా ఆశ పెట్టిందని పాటిదార్ కుల నాయకుడు నరేంద్ర పటేల్ ఆరోపించడం, రాహుల్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరడం, భాజపా ఇచ్చిన అడ్వాన్సు అంటూ ఓ పదిలక్షల విలువైన నోట్ల కట్టలను చూపించడం సంచలనం సృష్టిస్తోంది. పైగా సహజంగానే భాజపా ఈ ఆరోపణలను ఖండిస్తోంది. తమాషా ఏంటంటే.. పాటిదార్ కుల నాయకుడు నరేంద్ర ఆదివారం సాయంత్రం భాజపాలో చేరారు. అదే రోజు రాత్రి భాజపాపై ఆరోపణలు గుప్పించారు. తనకు డబ్బు ఆశ చూపించారని అన్నారు. మరురోజు సోమవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని.. భాజపా మీద విమర్శలు చేశారు.

ఈ ఎపిసోడ్ మొత్తం డ్రామాలాగా కనిపిస్తున్నదని విశ్లేషకులు భావించడంలో తప్పులేదు. ఎందుకంటే.. ఇవాళ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇలాంటి లోపాయి కారీ వ్యవహారాలు జరిగినప్పుడు – వాటిని నిజంగానే ఎండగట్టదలచుకుంటే ఎన్నిరకాలుగా ఆధారాలు సృష్టించవచ్చో అన్ని ఆప్షన్లూ ఉంటున్నాయి. కానీ ఎలాంటి ఆధారమూ లేకుండానే నరేంద్ర పటేల్.. భాజపా డబ్బు ఆశ చూపించదంటూ మాటలు చెప్పి బురద చల్లాలనుకుంటే ఫలితం ఉంటుందా? అనేది ప్రశ్న.

తెలంగాణలో ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి, చంద్రబాబునాయుడు ఎంత లోతుగా ఇరుక్కున్నారో అందరికీ తెలుసు. ఒక్క ఓటు వేయడానికి ఏకంగా నోట్ల కట్టల సూట్ కేసులతో వెళ్లి రేవంత్ రెడ్డి వీడియో సాక్ష్యాల సహా, నక్కి ఉన్న పోలీసులకు చిక్కిపోయారు. ఫోను సంభాషణల ఆడియో టేపులన్నీ.. వారికి కేసుల నుంచి విముక్తి దక్కదేమో అన్నంతగా ఉక్కిరి బిక్కిరి చేసేశాయి. ఒక లోపాయికారీ డీల్ జరుగుతున్నప్పుడు.. దానికి సంబంధించి.. రభస చేయానే ఉద్దేశం ఉంటే.. ఆధారాలను కూడా తయారు చేసుకోవాలి.

అంతే తప్ప.. భాజపాలో చేరిన తర్వాత.. వారి మీద బురద చల్లడానికి కాంగ్రెస్ తో డీల్ మాట్లాడుకుని.. మళ్లీ ఆ పార్టీలో చేరినట్లుగా ఈ వ్యవహారం కనిపిస్తు్న్నదని ప్రజలు అనుకుంటారు. నరేంద్ర పటేల్ టెక్నాలజనీ తెలియదని అనగల వృద్ధనాయకుడు కాదు. యువకుడు. మరి తను చేసే ఆరోపణలకు విశ్వసనీయత జోడించాలనే స్పృహ లేకపోతే ఎలా అని పలువురు భావిస్తున్నారు. అయినా ఇలాంటి ఆరోపణల్ని జనం విశ్వసిస్తున్నారో లేదో ఎన్నికలు వస్తే తప్ప తెలియదని పలువురు భావిస్తున్నారు.