జన్మ, పునర్జన్మ.. మతలబేంటి సురేఖమ్మా.!

ఒకప్పుడు తెలంగాణలోని వరంగల్‌ జిల్లాలో ఓ రేంజ్‌లో ‘పెత్తనం’ చెలాయించింది కొండా కుటుంబం. కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి రాజకీయాల్లో ఏ స్థాయిలో హల్‌చల్‌ చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పుణ్యమా అని మంత్రి అయిన కొండా సురేఖ, ఆయన మీద అభిమానంతోనే ఆయన మరణం తర్వాత జగన్‌ సీఎం కావాలనే డిమాండ్‌తో మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ విషయంలో కొండా సురేఖ కమిట్‌మెంట్‌కి హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే.

కానీ, ఆ తర్వాతే ఈక్వేషన్స్‌ మారిపోయాయి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో కొండా కుటుంబానికి మొదట్లో బాగానే ప్రాధాన్యత లభించినా, క్రమక్రమంగా అది తగ్గుతూ వచ్చింది. చివరికి, కొండా దంపతులు వైఎస్సార్సీపీని వీడాల్సి వచ్చింది. ఆ తర్వాత కొండా దంపతులు టీఆర్‌ఎస్‌లో చేరడం తెల్సిన విషయమే. టీఆర్‌ఎస్‌లోనూ కొండా దంపతులకు తగిన ప్రాధాన్యత దక్కుతుందనీ, కొండా సురేఖకు మంత్రి పదవి దక్కుతుందని అంతా అనుకున్నారు.

అయితే, అక్కడున్నది కేసీఆర్‌. పక్కాగా స్కెచ్‌ ప్రిపేర్‌ చేశారు. కొండా దంపతుల్ని కామప్‌ చేసేశారు. టీఆర్‌ఎస్‌లో చాలా కష్టంగానే కొండా దంపతులు నెట్టుకొచ్చేస్తున్నారన్నది ఓపెన్‌ సీక్రెట్‌. ఎర్రబెల్లి దయాకర్‌రావు రాకని కొండా దంపతులు వ్యతిరేకించినా, కేసీఆర్‌ లెక్కచేయలేదంటేనే ‘వుంటే వుండండి, పోతే పొండి..’ అన్న వైఖరిని ఆయన ప్రదర్శించారని అర్థమయిపోతుంది.

ఇక, ఇప్పుడు కొండా దంపతులు పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. నిజానికి ఈ ప్రచారం ఎప్పటినుంచో జరుగుతున్నదే. ఇప్పుడు ఇంకాస్త గట్టిగా జరుగుతోందంతే. టైమ్‌ చూసి, కాక రేపినట్లు కాంగ్రెస్‌ పార్టీ, కొండా దంపతులు తమతో టచ్‌లో వున్నట్లు ప్రకటించింది. అంతే, కొండా దంపతులూ షాక్‌కి గురయ్యారు. ‘చాపకింద నీరులా’ వ్యవహారం చక్కబెట్టేద్దామనుకుంటే, అదిప్పుడు ఓపెన్‌ అయిపోయింది.

చేసేది లేక, ‘వైఎస్‌ రాజకీయంగా జన్మనిస్తే, కేసీఆర్‌ పునర్జన్మనిచ్చారు..’ అంటూ కొండా సురేఖ, టీఆర్‌ఎస్‌ విడిచి పెట్టేది లేదని తేల్చి చెప్పారు. పైకి ఏం చెప్పినా, తెరవెనుక జరుగుతున్న తతంగమేంటో వరంగల్‌ జిల్లాలో ప్రతి ఒక్కరికీ తెలుసన్నది కాంగ్రెస్‌ వాదన. టీడీపీని వీడి, రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరాక.. ఆ హీట్‌ని అలా మెయిన్‌టెయిన్‌ చెయ్యడంలో కాంగ్రెస్‌ కొంతమేర సఫలమవుతోంది. ఈ వేడి ఏమాత్రం తగ్గకుండా.. ఇదిగో ఇలాంటి ‘మైండ్‌ గేమ్స్‌’ తెరపైకి తెచ్చిందన్నమాట కాంగ్రెస్‌ పార్టీ. నిప్పు లేకుండా పొగ పుట్టదన్నది మామూలు మాటే అయినా, రాజకీయాల్లో పొగ పుట్టడానికి నిప్పు అవసరమే లేదు. పొగ అయితే వచ్చింది కదా, టీఆర్‌ఎస్‌లో కొండా దంపతులకు వ్యతిరేకంగా నిప్పు రాజుకోవడమే తరువాయి.!

ఒక్కటి మాత్రం నిజం.. కొండా దంపతులు, గులాబీ గూటి నుంచి తప్పుకుంటే మాత్రం తెలంగాణలో పొలిటికల్ ఈక్వేషన్స్ ఎవరూ ఊహించని విధంగా మారిపోతాయి.