జస్ట్‌ ఆస్కింగ్‌.. అది తీవ్రవాదమేగానీ.!

మతం పేరు చెప్పి ప్రాణాలు తీస్తే, అది ఖచ్చితంగా తీవ్రవాదమే. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. కానీ, ఓ తీవ్రవాది మతం పేరు చెప్పి, ఆ ఘాతుకానికి పాల్పడితే, ఆ మకిలిని ఆ మతానికి ఎలా అంటగట్టగలం.? ఇదీ అసలు పాయింట్‌. దీన్నే కమల్‌హాసన్‌ మిస్సయ్యాడు. కమల్‌హాసన్‌ని వెనకేసుకొద్దామనుకుని, ‘జస్ట్‌ ఆస్కింగ్‌’ అంటూ ప్రకాష్‌రాజ్‌ కొన్ని ప్రశ్నలు సంధించాడుగానీ, ఈయనా ‘వాస్తవాన్ని’ విస్మరించాడు.

హిందూ, ఇస్లాం, క్రిస్టియానిటీ.. ఇలా ఏ మతం కూడా హింసని ప్రోత్సహించదు. దురదృష్టవశాత్తూ ఇస్లామిక్‌ తీవ్రవాదం అని కొందరు, హిందూ తీవ్రవాదం అని కొందరు.. ‘తమ రాజకీయ అవసరాలకు తగ్గట్టుగా’ పేర్లు పెట్టేస్తూ, ఆయా మత విశ్వాసాల్ని, ఆయా మతస్తుల ఆత్మగౌరవాన్నీ దెబ్బకొట్టేస్తున్నారు. ఒకప్పటి పరిస్థితులు వేరు.. ఇప్పటి పరిస్థితులు వేరు. ప్రకాష్‌రాజ్‌ అయినా, కమల్‌హాసన్‌ అయినా ఈ విషయాన్ని తెలుసుకోవాల్సి వుంది.. ఎందుకంటే, ‘మేధావులం’ అనే గుర్తింపు పొందేశారు కదా.!

ఇక్కడ ప్రకాష్‌రాజ్‌, డైరెక్ట్‌గా కమల్‌హాసన్‌ని సమర్థించలేదు.! జస్ట్‌ ఆస్కింగ్‌.. అంటూ ప్రకాష్‌రాజ్‌ సంధించిన ప్రశ్నల్ని పరిశీలిస్తే, కమల్‌హాసన్‌ ‘హిందూ తీవ్రవాదం’పై చేసిన వ్యాఖ్యలకు పరోక్షంగా మద్దతిస్తున్నట్లే ఈ వ్యాఖ్యలున్నాయనిపిస్తుంది. ఇక కమల్‌పై కేసులు నమోదయ్యాయి ‘హిందూ తీవ్రవాదం’ అంట ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి. ఎలాగూ కమల్‌ తరఫున న్యాయపోరాటం జరుగుతుందనుకోండి.. అది వేరే విషయం. ఆ తర్వాతే తెలుస్తుంది, అసలు సంగతేంటో.!

పొరుగు దేశాల నుంచి తీవ్రవాదులు దేశం మీద దండెత్తినట్లుగా.. దేశంలో మారణహోమానికి తెరలేపినప్పుడు.. అభాగ్యులు ఆ తీవ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయినప్పుడు గుర్తుకు రాని ’మత తీవ్రవాదం‘ ఈ సెలబ్రిటీలకు ఇప్పుడే గుర్తుకు రావడాన్ని ఎలా అర్థం చేసుకోవాలట.?