మాస్ మహారాజాగా అభిమానులు, దర్శకులతో పిలిపించుకునే రవితేజ ఆ మధ్య వరుస పరాజయాలతో చాలా నెలల పాటు విరామం తీసుకున్నాడు. రాజా ది గ్రేట్ చిత్రంలో అంధుడి పాత్ర పోషించడానికి అంగీకరించడంతో రూటు మార్చాడనే అనుకున్నారు. ఆ చిత్రంలో బ్లయిండ్ క్యారెక్టర్ మినహా రవితేజ ఎలాంటి వెరైటీ చూపించలేదు. ఎప్పుడూ చేసేదే అంధుడి పాత్రలో చేయడంతో ఆ చిత్రం పాస్ అయిపోయింది.
ఆ వెంటనే ‘టచ్ చేసి చూడు’ చిత్రంలో రవితేజ ఎప్పటిలా తన ధోరణిలోకి వెళ్లిపోయాడు. ఆ చిత్రం పెద్ద డిజాస్టర్ అయింది. రవితేజ సినిమాల్లోనే భారీ నష్టం చవిచూసిన సినిమాగా నిలిచింది. అయినప్పటికీ రవితేజ పంథా మార్చుకోలేదు. అతని తాజా చిత్రం ‘నేల టిక్కెట్టు’ కూడా రవితేజ మార్కు మూసతనంతో నిండిపోయింది. ఇప్పటికే ఆడియో పెద్దగా క్లిక్ కాకపోగా, ట్రెయిలర్స్ కూడా ఆకర్షణీయంగా లేవు. ఏదైనా ట్రెయిలర్ చూడగానే సినిమా చూడాలనే కోరిక పుట్టాలి.
అలా ఇంప్రెస్ చేయడంలో ‘నేల టిక్కెట్టు’ ట్రెయిలర్ పూర్తిగా విఫలమయింది. ఈ ట్రెయిలర్ చూసిన నెటిజన్లు ‘మాస్ మహారాజ్’ని ‘మూస మహారాజ్’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. యధావిధిగా భజన రాయళ్లు సూపరహో అని బాకాలు ఊదేస్తున్నారు కానీ రవితేజ మాత్రం మరో మూస సినిమాతోనే బాక్సాఫీసు మీదకి దండెత్తుతున్నాడని స్పష్టంగా కనిపిస్తోంది.