ట్రంప్ ఇంకా ఇండియా మ‌త్తులోనే ఉన్నాడే

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌ సకుటుంబ సమేతంగా మంగళ, బుధవారాల్లో భారత్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. పర్యటన ముగించుకుని స్వదేశానికి చేరుకున్నప్ప‌టికీ…ఆయ‌న‌కు ఇంకా ఇండియా అంటే ఓ రేంజ్‌లో మ‌మ‌కారం ఉంద‌ని నిరూపించుకున్నారు. ట్రంప్‌ మీడియాతో మాట్లాడుతూ.. భారత్‌ను అద్భుతమైన దేశంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కొనియాడారు. తన పర్యటనతో ద్వైపాక్షిక సంబంధాల్లో గణనీయ పురోగతి నమోదైందని చెప్పారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీపై ప్ర‌శంస‌లు కురిపించారు. మోదీ గొప్ప వ్యక్తి, గొప్ప నాయకుడని కొనియాడారు. తమకు అద్భుతమైన ఆతిథ్యం లభించిందన్నారు. తన పర్యటనతో ద్వైపాక్షిక సంబంధాల్లో గణనీయ పురోగతి నమోదైందని, రెండు దేశాల మధ్య సంబంధాలు ప్రస్తుతం అత్యద్భుతంగా ఉన్నాయన్నారు. భారత్‌తో పెద్ద ఎత్తున వాణిజ్యాన్ని నిర్వహించనున్నామని, వారు (భారత్‌) ప్రస్తుతం వందల కోట్ల డాలర్లను అమెరికాకు పంపుతున్నారని చెప్పారు.

అయితే, ట్రంప్‌కు ఇండియా టూర్ విష‌యంలో ఓ ఊహించ‌ని చిక్కు ఎదురైంది. ఢిల్లీ హింసపై మోదీతో చర్చించలేదని, అది భారత్‌ అంతర్గత విషయమని ట్రంప్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇలా భారత్‌పై ట్రంప్‌ యంత్రాంగం సానుకూల వ్యాఖ్యలు చేయగా, అధ్యక్ష ఎన్నికల్లో ఆయనకు ప్రత్యర్థిగా నిలువనున్న డెమొక్రటిక్‌ పార్టీ నేత బెర్నీ శాండర్స్‌ మాత్రం విమర్శలు గుప్పించారు. ఢిల్లీ హింసపై ట్రంప్‌ వ్యాఖ్యలు పూర్తిగా నాయకత్వ వైఫల్యమని ఆరోపించారు.
‘భారత్‌లో 20 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు. (ఢిల్లీలో) ముస్లిం వ్యతిరేక మూక దాడుల్లో 27 మంది మృతిచెందారు. చాలా మంది గాయపడ్డారు. అయితే అది భారత్‌ విషయమని ట్రంప్‌ చెబుతున్నారు. మానవ హక్కులకు సంబంధించి ఇది పూర్తిగా నాయకత్వ వైఫల్యమే’ అని ఆయన విమర్శించారు.