తమ్ముడి పనైపోయింది… మరి అన్న..?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి తమ్ముడు కిషోర్‌ కుమార్‌ పని అయిపోయింది. పనైపోయిందంటే ఆయనకు ఏదో అశుభం జరిగిందని కాదు. తనకు శుభం జరుగుతుందనే ఆలోచనతోనే అధికార టీడీపీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు వస్తుందా? రాదా? ఇప్పుడు చెప్పలేం. కాంగ్రెసు కుటుంబానికి చెందిన ఈయన టీడీపీలో ఎందుకు చేరాల్సివచ్చింది? టీడీపీలో చేరితేనే తమ కుటుంబానికి రాజకీయంగా రక్షణ, మనుగడ ఉంటాయనే విశ్వాసం ఉందన్నారు. అన్నయ్య కిరణ్‌కుమార్‌ తన భవిష్యత్తును నిర్ణయించుకోవాల్సివుందన్నారు.

కిరణ్‌ సీఎంగా ఉన్నప్పుడు ఆయన అధికారాన్ని అడ్డుపెట్టుకొని కిషోర్‌ అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని, ఆర్థిక ప్రయోజనాలు పొందారని అప్పట్లో టీడీపీ నాయకులు ఆరోపణలు చేశారు. టీడీపీతో ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడితో చిత్తూరు జిల్లాలో నల్లారి కుటుంబానికి దశాబ్దాల తరబడి వైరముంది. వైరంతో సాధించేది ఏమీ లేదనే ఆలోచనతో కావొచ్చు కిషోర్‌కుమార్‌ టీడీపీ తీర్థం తీసుకున్నారు. ఇందుకు కిరణ్‌ ఆశీర్వాదం, మద్దతు ఉన్నాయా? లేవా? తెలియదు.

అన్నదమ్ములిద్దరూ చర్చించుకొనే ఈ పని చేసినా చేసుండొచ్చు. రాజకీయమంటే అదే కదా. నల్లారివారిది పక్కా కాంగ్రెసు కుంటుంబం. ఒకప్పటి రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించిన కిరణ్‌కుమార్‌ తండ్రి నల్లారి అమర్‌నాథ్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేందుకు అర్హతలున్నా నాయకుడు. స్వతహాగా క్రికెటరైన కిరణ్‌కుమార్‌ రెడ్డి ఇండియన్‌ టీములో ఆడి గొప్ప క్రీడాకారుడు కావాలనుకున్నా తండ్రి మరణం తరువాత రాజకీయాల్లో కుటుంబం ఉనికిని కాపాడటం కోసం తప్పనిసరిగా పాలిటిక్స్‌లోకి ప్రవేశించారు.

ఆయన కృషో, అదృష్టమోగాని మొదట స్పీకర్‌ అయిన తరువాత మంత్రి పదవి చేయకుండానే ముఖ్యమంత్రి అయ్యారు. ఇదంతా తెలిసిన కథే. కిషోర్‌కుమార్‌ గత ఎన్నికల్లో అన్న పెట్టిన జై సమైక్యాంధ్ర పార్టీ తరపున పీలేరులో పోటీ చేసి ఓడిపోయిన కొంతకాలానికే టీడీపీలో చేరాలనే ఆలోచన చేసినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. ఆ పార్టీ నాయకులను కలిసి మంతనాలు జరిపారు. అది ఇప్పుడు వర్కవుట్‌ అయిందన్నమాట. తమ్ముడు ఒక పార్టీవాడైనందుకు సంతోషమే. కాని అన్న మాటేమిటి?

రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసిన కిరణ్‌ తన భవిష్యత్తు ఏమిటి? ఏం చేయదల్చుకుందీ ఇప్పటివరకు చెప్పలేదు. ఆ పార్టీలో చేరబోతున్నారని, ఈ పార్టీలో చేరబోతున్నారని అప్పుడప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి. కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోయిన తరువాత ఈయన రాజకీయ రీఎంట్రీపై వచ్చినన్ని కథనాలు, ఊహాగానాలు మరో నాయకుడిపై రాలేదని చెప్పొచ్చు. బిజెపిలో చేరతారని, మళ్లీ కాంగ్రెసులోకే వస్తారని వివిధ రకాలుగా ప్రచారం జరిగింది. కొంతకాలం కిందట రీఎంట్రీపై ఓ వార్త ప్రముఖ పత్రికలో తళుక్కుమన్నా స్పందించలేదు.

ఒకటిరెండుసార్లు తనకుతానై రీఎంట్రీ గురించి ప్రస్తావించారు. ఫలాన పార్టీ అని చెప్పకుండా మళ్లీ యాక్టివ్‌ అవుతానని అర్థం వచ్చేలా మాట్లాడారు. కాంగ్రెసులో మళ్లీ అడుగు పెట్టబోతున్నట్లు ఆమధ్య వార్తలొచ్చాయి. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఏపీకి వస్తారని, ఆయన సమక్షంలో తీర్థం పుచ్చుకుంటారని, అలా పుచ్చుకోగానే ఎఐసిసి కార్యదర్శి పదవి ఇస్తారని సమాచారమొచ్చింది. బిజెపి, కాంగ్రెసు నాయకులు ఆయనతో సంప్రదింపులు జరిపే ఉండొచ్చు. బిజెపిలో చేరాలన్నా, సొంత గూటికి మళ్లీ రావాలన్నా బేరాలు కుదరాలి కదా. ఈ క్రమంలో ఆయన కాంగ్రెసు అయితేనే బాగుంటుందని అనుకున్నారేమో…!

గత ఏడాది ఓ సందర్భంలో ఆయన తన సన్నిహితుల వద్ద రీఎంట్రీ గురించి మాట్లాడుతూ మాటా ముచ్చట అయ్యాయని, పెళ్లికూతురు పేరు గోప్యంగా ఉంచామని చెప్పారు. తాళిబొట్టు కట్టే తేదీ ఖరారైతే అందరికీ శుభలేఖలు పంపుతానని, తొందరపడాల్సిన అవసరం లేదన్నారు. ఆ తరువాత మౌనంగా ఉండిపోయారు. తమ్ముడు కిషోర్‌ కుమార్‌ టీడీపీలో చేరిన సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి స్పందిస్తూ ‘కాంగ్రెసులో చేరేందుకు కిరణ్‌కుమార్‌ రెడ్డి ఇప్పటికీ మానసికంగా సిద్ధం కాలేదు’ అని చెప్పారు. ఎన్నికలనాటికి ఓ నిర్ణయం తీసుకుంటారా?