తమ్ముళ్లకు చెప్పలేరు.. అధికారులపై చిందులా?

కొన్ని విషయాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి వైఖరి చాలా చిత్రంగా కన్పిస్తూ ఉంటుంది. తన సొంతపార్టీ ఎమ్మెల్యేలు క్రమశిక్షణ తప్పి ప్రవర్తిస్తే… చంద్రబాబు వారిని ఏమీ అనలేని స్థితిలో ఉన్నారా.. అని కొన్ని సార్లు జాలికలుగుతుంది. తన సొంత పార్టీ ఎమ్మెల్యేలు… తన పట్ల ఖాతరు లేకుండా ప్రవర్తిస్తే… వారిని మందలించలేక… చంద్రబాబు ఐఎఎస్ అధికారులపై చిందులు తొక్కుతున్నారా… అనే సందేహం కలుగుతుంది.

ఎందుకంటే చంద్రబాబునాయుడు తెలుగుదేశంపార్టీ సమన్వయకమిటీ సమావేశం నిర్వహించారు. పార్టీ కీలకనేతలు, మంత్రులు హాజరయ్యారు. ఎమ్మెల్యేలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఐతే ఓ ఎమ్మెల్యే డుమ్మాకొట్టి వెళ్లిపోయారు. ఆయన గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు వాకబు చేస్తే కలెక్టర్లతో అపాయింట్ మెంట్ ఉందని వెళ్లినట్లు తెలిసింది. ఆ ఎమ్మెల్యేకు నాకంటే… కలెక్టర్లే ఎక్కువా… అని కత్తులు నూరారు. ఇక మీదట తన మీటింగ్ ఉన్న సమయంలో ఎమ్మెల్యేలల్లో ఎవ్వరికీ అపాయింట్ ఇవ్వకుండా కలెక్టర్లను ఆదేశిస్తానని హూంకరించారు.

అయినా తన మీటింగ్ ఎగ్గొట్టొద్దని తన పార్టీ ఎమ్మెల్యేలకు గట్టిగా క్లాస్ పీకాల్సిన బదులు… కలెక్టర్లకు ఆదేశాలిస్తాననడం విడ్డూరంగా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అంటే… కలెక్టర్లు ఇక మీదట… ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడెప్పుడు పార్టీ మీటింగ్ పెడుతారో… ముందుగా తెలుసుకుని… ఆప్రకారం ముందుగా అపాయింట్ మెంట్లు.. ఇవ్వాలా.. అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. ముఖ్యమంత్రికి అధికారులంటే చులకనభావన ఏర్పడిపోయిందని పలువురు ఆవేదన చెందుతున్నారు.