తెలంగాణలో కాంగ్రెసు సాధించిందేమిటి?

కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ మంచి మనసు కారణంగానే, ఆమె దయ వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని కాంగ్రెసు నాయకులు చెప్పుకుంటూవుంటారు. రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెసుకు కాకుండా కేసీఆర్‌కు అధికారం దక్కడాన్ని కొందరు నాయకులు ఇప్పటికీ జీర్ణం చేసుకోలేకపోతున్నారు. జీర్ణం చేసుకున్నవారు టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. గత ఎన్నికల్లో 21మంది ఎమ్మెల్యేలుగా గెలవగా, ఎనిమిదిమంది టీఆర్‌ఎస్‌లోకి వెళ్లారు.

పలు ప్రతిపక్షాల నుంచి ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి వెళ్లారు తప్ప, అక్కడి నుంచి ఏ ప్రతిపక్షంలోనూ చేరలేదు. 2014 నుంచి కాంగ్రెసు ఎమ్మెల్యేలు బయటకు పోయారు తప్ప ఆ పార్టీలోకి ఏ ఎమ్మెల్యే కూడా చేరలేదు. మొదటిసారిగా టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి చేరడం కాంగ్రెసు సాధించిన ఘనతగా చెప్పుకోవచ్చు.

సాదాసీదా ఎమ్మెల్యే చేరితే ఇంత సంచలనం కలగకపోయేది. ఫైర్‌బ్రాండ్‌గా పేరుపొంది, ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆయన కుటుంబం మీద నిప్పులు చెరిగే సత్తా ఉన్న రేవంత్‌ చేరడంతో కాంగ్రెసుకు అదొక ఘన విజయమైంది. మూడున్నరేళ్ల తరువాత వేరే పార్టీ నుంచి ఎమ్మెల్యే చేరడం రికార్డు. ఇంత రికార్డు సృష్టించిన కాంగ్రెసు పార్టీ ఆయనకు ఏం పదవి, ఎప్పుడు ఇస్తుందో ఇంకా తేలలేదు.

రేవంత్‌ చేరకముందు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవితోపాటు ప్రచార కమిటీ బాధ్యత కూడా అప్పగిస్తారనే ప్రచారం జరిగింది. అప్పుడు జరిగిన ప్రచారం చూస్తే చేరగానే పదవులు చేతిలో పెడతారని రేవంత్‌ అనుచరులు, అభిమానులు అనుకున్నారు. కాని ఇంకా సమయం ఉందని సమాచారం. పదవుల విషయం కొంతకాలం తరువాత చూద్దామని అధిష్టానం ఆలోచిస్తోంది.

ఇందుకు కారణం రేవంత్‌ చేరికను కొందరు నాయకులు స్వాగతించలేదు. వారు ఆగ్రహంగా ఉన్నారు. ‘పార్టీలో చేరగానే బాహుబలి కాడు’ అని సీనియర్‌ నేత జానారెడ్డి వ్యాఖ్యానించడం ఇందుకు నిదర్శనం. పార్టీలో కొత్త నాయకుడు చేరినప్పుడు కొందరు వ్యతిరేకించడం సహజమే. పాత వారికి ఇవ్వని ప్రాధాన్యం, పదవులు కొత్తవారికి ఇస్తే ఆగ్రహం వస్తుంది కదా. కొత్త నాయకుడి కింద పాత నాయకులు పనిచేయాల్సివస్తుంది. ఈ సమస్య కారణంగానే పదవులు ఇవ్వడాన్ని అధిష్టానం వాయిదా వేసిందట..! రేవంత్‌ను కాంగ్రెసులో చేర్చుకోవడం ఒక ఎత్తయితే, కొడంగల్‌కు ఉప ఎన్నిక జరిగితే గెలిపించుకోవడం మరో ఎత్తు. ఇది పార్టీలో చేర్చుకున్నంత సులభం కాదు.

ఉప ఎన్నిక వస్తుందా? రాదా? అనేది చర్చనీయాంశమైంది. రాజీనామా లేఖ ఇప్పటివరకు స్పీకరుకు అందలేదు. అందగానే ఆమోదిస్తారా? పెండింగులో పెడతారా? దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాత ఫిరాయింపుదారులను అనర్హులను చేయాలనే పిటిషన్లు సుప్రీం కోర్టులో విచారణలో ఉన్నాయి. అవి కోర్టులో ఉండగా ఈ ఒక్క రాజీనామా ఆమోదిస్తారా? కోర్టు నిర్ణయం కోసం ఎదురుచూస్తారా? ఏం జరుగుతుందో తెలియకపోయినా కొడంగల్‌పై మాత్రం అధికార, ప్రతిపక్షాల దృష్టి ఉంది. టీఆర్‌ఎస్‌ ముగ్గురు మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసి కసరత్తు చేస్తోందని సమాచారం. సో…రేవంత్‌ను చేర్చుకొని రికార్డు సృష్టించిన కాంగ్రెసు కొడంగల్‌లో విజయం సాధిస్తే డబుల్‌ రికార్డు సాధించినట్లే.