తెలంగాణలో కేసీఆర్‌ ‘ది గ్రేట్‌’.!

ఆంధ్రప్రదేశ్‌లో ఉనికి కోల్పోయినా, చంద్రబాబు సర్కార్‌పై పోరాటం చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ తాపత్రయ పడ్తోంది. వామపక్షాల సంగతి సరే సరి. మిత్రపక్షమే అయినా, అప్పుడప్పుడూ బీజేపీ కూడా, టీడీపీతో ‘పంచాయితీ’కి వెనుకాడ్డంలేదు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన ప్రతిపక్షం. ఈ రెండు పార్టీల మధ్యా వున్న రాజకీయ వైరం గురించి కొత్తగా చెప్పాల్సిన పనేముంది.?

రాజకీయాల్లో అధికారపక్షంపై ఇతర రాజకీయ పార్టీలు పోరాడం సర్వసాధారణం. ఒక్కోసారి విపక్షాలన్నీ కలిసి ఉమ్మడిగా అధికారపక్షంపై పోరాటం చేయడం చూస్తుంటాం. కొన్ని సందర్భాల్లో ఎవరి దారి వారిదే అన్నట్లు వ్యవహరించడమూ చూస్తూనే వున్నాం. సో, ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినంతవరకు ‘రాజకీయం’ ఓ పద్ధతి ప్రకారం నడుస్తోందనే అనుకోవచ్చు.

మరి, తెలంగాణలో పరిస్థితేంటి.? అసలు తెలంగాణలో ప్రతిపక్షం, విపక్షం అనే ప్రస్తావనల్లో అర్థం ఏమైనా వుందా.? ఈ ప్రశ్నలకు సమాధానం వెతికితే దిగ్భ్రాంతికర వాస్తవాలు వెలుగు చూస్తాయి. తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌కి, మజ్లిస్‌ పార్టీ మిత్రపక్షం. అదీ బయటనుంచి మద్దతిస్తోన్న మిత్రపక్షం. మజ్లిస్‌ గొంతెమ్మ కోరికలు కోరినా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీర్చేస్తుంటారు.

ఇక, కాంగ్రెస్‌ పార్టీ, తెలంగాణలో ప్రతిపక్షమే అయినా, ఆ కాంగ్రెస్‌ పార్టీలో టీఆర్‌ఎస్‌ అనుకూల వర్గం బలంగానే వుంది. సాక్షాత్తూ ప్రతిపక్ష నేత జానారెడ్డి సైతం అప్పుడప్పుడూ టీఆర్‌ఎస్‌ మీద అమితమైన ప్రేమ ప్రదర్శించేస్తుంటారు. ఆ జానారెడ్డి సాయంతో కాంగ్రెస్‌లోని టీఆర్‌ఎస్‌ వ్యతిరేక వర్గాన్ని ఏ స్థాయిలో టీఆర్‌ఎస్‌ ర్యాగింగ్‌ చేస్తోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.!

బీజేపీ విషయానికొస్తే, ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వానికీ, జాతీయ నాయకత్వానికీ మధ్య చాలా వైరుద్యాలున్నాయి టీఆర్‌ఎస్‌కి సంబంధించి. తెలంగాణ బీజేపీ నేతలు, టీఆర్‌ఎస్‌పై రాజకీయ పోరాటం చేస్తోంటే, జాతీయ స్థాయిలో బీజేపీ నేతలు, తెరవెనుకాల టీఆర్‌ఎస్‌తో లాలూచీ పడ్డం చాలా సందర్భాల్లో స్పష్టమయిపోయింది. ఇప్పుడిక మిగిలింది టీడీపీ మాత్రమే. రేవంత్‌, టీడీపీకి దూరమయ్యాక.. టీడీపీ – టీఆర్‌ఎస్‌తో పొత్తు కోసం తెలంగాణ టీడీపీ నేతలు పడ్తున్న ఆరాటం అంతా ఇంతా కాదు.

వామపక్షాల్ని ఏపీలోనే కాదు, తెలంగాణలోనూ పెద్దగా పట్టించుకునే పరిస్థితి లేదు. సో, తెలంగాణలో మొత్తంగా విపక్షమే లేదనుకోవాలన్నమాట. ఈ స్థాయిలో తెలంగాణ రాజకీయాలు మారాయంటే, కేసీఆర్‌ రాజకీయ వ్యూహాలు ఎంత బాగా వర్కవుంట్‌ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.! అందుకే, కేసీఆర్‌ ది గ్రేట్‌.!