తెలంగాణలో రాజకీయ పార్టీల్లేవా?

రాజకీయ నాయకులు ఒక్కోసారి ఏం మాట్లాడతారో అర్థంకాదు. మనుసులో ఏదో పెట్టుకొని బయటకు మరేదో చెబుతుంటారు. విషయం వివరంగా చెప్పకపోవడంతో అది జనాలకు అంతుబట్టదు. టీడీపీ నుంచి బయటపడాలని ప్లాన్‌ చేసుకున్న తెలంగాణ టీడీపీ కమిటీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి ‘తెలంగాణలో రాజకీయ పార్టీలు లేవు. కేసీఆర్‌ వ్యతిరేకులు, అనుకూలురు మాత్రమే ఉన్నారు.

వ్యతిరేకులంతా ఏకం కావాలి’ అన్నారు. వ్యతిరేకులంతా ఏకం కావాలనడం బాగానే ఉంది. కాని రాజకీయ పార్టీలు లేవని చెప్పడమేంటి? రాజకీయ పార్టీలు లేకపోతే తాను కాంగ్రెసు పోవాలని ఎందుకు ప్లాన్‌ చేసుకున్నారు? పార్టీలు లేవంటే టీడీపీ కూడా లేనట్లేనా? తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెసు, బీజేపీ పోటీలు పడుతూ వచ్చే ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తామని చెప్పుకుంటున్నాయి. టీడీపీ నాయకులూ ఈ మాటే అన్నారు.

అధికారం కోసం పోరాడేది రాజకీయ పార్టీలేగాని వ్యక్తులు కాదు కదా. పార్టీలు లేకుండా వ్యక్తులే ఉన్నారని అనుకున్నప్పుడు రేవంత్‌ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయవచ్చు కదా. కాంగ్రెసులో చేరాలనుకోవడం ఎందుకు? పార్టీలు లేవనుకున్నప్పుడు పొత్తుల గోల ఎందుకు? కాంగ్రెసుతో పొత్తు పెట్టుకోవాలన్న రేవంత్‌ రెడ్డి పట్టుదల కారణంగానే టీడీపీలో సంక్షోభం చెలరేగింది. టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోవాలని కొందరికి ఉంది. టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి కాంగ్రెసు సుముఖంగా ఉందా? తెలియదు. ఆ పార్టీలో నిర్ణయాలు తీసుకునేది అధిష్టానం తప్ప స్థానిక నాయకులు కాదు. పొత్తుల విషయంలో తెలంగాణ టీడీపీకీ చంద్రబాబు నాయుడు స్వేచ్ఛ ఇవ్వాలని రేవంత్‌ డిమాండ్‌ చేస్తున్నాడు.

టి-టీడీపీ స్వతంత్రంగా వ్యవహరించాలని బాబు చెప్పారు కాబట్టి ఈ నాయకుడు దానికనుగుణంగానే స్వేచ్ఛ ఇవ్వాలని కోరడంలో తప్పులేదు. కాని ఇలా రేవంత్‌ ఒక్కడే డిమాండ్‌ చేస్తున్నాడు తప్ప అధ్యక్షుడు రమణ, ఇతర నాయకులు మాట్లాడలేదు. కమిటీ అంతా ఏకాభిప్రాయంతో స్వేచ్ఛ ఇవ్వాలని అధినేతను కోరాలి. అది జరగలేదు. టీడీపీకి పర్యాయపదంగా రేవంత్‌ మారాడు. కేసీఆర్‌పై ఘాటు విమర్శలు చేసే నాయకుడు ఆయన తప్ప ఎవరూ లేరు.

ఏపీలో చంద్రబాబు నాయుడు ఎంతో, తెలంగాణలో రేవంత్‌ అంత అనేలా పరిస్థితి ఉంది. దీంతో తానేం చెబితే అది జరగాలనే ధోరణి ఈ నాయకుడిలో పెరిగినట్లుగా కనబడుతోంది. కాంగ్రెసుతో పొత్తు పెట్టుకోవాలని ప్రతిపాదించిన రేవంత్‌ ఆ విషయమై అధినేతను కలిసి మాట్లాడాడా? ఆ పొత్తు వల్ల ఎలాంటి ప్రయోజనాలున్నాయో, అది రాజకీయంగా ఎందుకు తప్పు కాదో వివరించాడా?

ఆయన పని చేశాక అప్పటికీ బాబు అంగీకరించకపోతే పార్టీ నిర్ణయానికి కట్టుబడటమో, తన దారి తాను చూసుకోవడమో చేయాలి. ఏది ఏమైనా కాంగ్రెసులోకి వెళ్లాలనుకున్నప్పుడు ఇంత రాద్ధాంతం చేయకుండా ఉంటే సరిపోయేదేమో. ఇక టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోవడం రాజకీయంగా ఎంతవరకు సరైందో దాన్ని సమర్థించేవారు వివరించాలి. అసలు టీడీపీతో పొత్తు పెట్టుకోవల్సిన అవసరం టీఆర్‌ఎస్‌కు ఎందుకుంటుంది? ఎవ్వరితోనూ పొత్తులుండవని కేసీఆర్‌ గతంలో చెప్పారు. అందుకోసం ఆ పార్టీ వెంపర్లాడక్కర్లేదు.

ప్రస్తుతం అది బలంగా ఉంది. ఎన్నికల్లో విజయమూ దానిదేనని విశ్లేషకుల అంచనా. టీఆర్‌ఎస్‌తో పొత్తు ప్రతిపాదన కేసీఆర్‌ దగ్గరకు వెళ్లలేదు. తెలంగాణలో పొత్తులపై బాబు మనసులో ఏముందో తెలియదు. దీనిపై వెంటనే స్పష్టత ఇవ్వాలని రేవంత్‌ కోరుతున్నాడు. బాబు దీనిపై స్పష్టత ఇవ్వక తప్పదు. కాని రేవంత్‌ ఆయనకు సమయం ఇవ్వాలని ఎందుకనుకోవడంలేదు? చంద్రబాబు విదేశాల నుంచి రాగానే కలిసి మాట్లాడతానన్నాడు. అప్పుడు ఈయనేం చెబుతాడో, ఆయనేం అంటాడో చూడాలి.