తెలంగాణ కాంగ్రెస్‌కి ‘స్టార్‌’ ఎవరంటే.!

తెలంగాణలో బలోపేతమయ్యేందుకు కాంగ్రెస్‌ పార్టీ కొత్త వ్యూహాలు సిద్ధం చేసింది. తెలంగాణ టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డికి గాలం వేసి, దాదాపు సక్సెస్‌ అయిన కాంగ్రెస్‌ పార్టీ, మైనార్టీ ఓటు బ్యాంకుని తమవైపుకు తిప్పుకునేందుకు హైద్రాబాద్‌ ఎంపీ స్థానం నుంచి మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌ని రంగంలోకి దింపేందుకు సన్నాహాలు చేస్తోంది.

మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణల నేపథ్యంలో క్రికెట్‌కి దూరమైన అజారుద్దీన్‌, ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో చేరడం, కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌ నుంచి లోక్‌సభకు ఎంపిక కావడం తెల్సిన విషయాలే. 2019 ఎన్నికల్లో అజారుద్దీన్‌ హైద్రాబాద్‌ నుంచి పోటీ చేయాలన్నది తెలంగాణ కాంగ్రెస్‌ నేతల అభిప్రాయం. అంతే కాదు, గ్రేటర్‌ హైద్రాబాద్‌ పరిధిలో పూర్తిగా అజారుద్దీన్‌తో ఇప్పటినుంచే ప్రచార కార్యక్రమాలు షురూ చేయాలనుకుంటోందట.

‘తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి అజారుద్దీన్‌ స్టార్‌ క్యాంపెయినర్‌ కాబోతున్నారు..’ అంటూ తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు అప్పుడే ప్రకటించేశారు. మరోపక్క, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఎప్పటినుంచో ‘బాహుబలి’ జపం చేస్తోన్న విషయం విదితమే. ఆ బాహుబలి ఇంకెవరో కాదు, రేవంత్‌రెడ్డేనన్న ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ పార్టీలో రేవంత్‌రెడ్డి అనుకూల వర్గం (కొత్తగా తయారైంది లెండి) ధృవీకరిస్తుండడం గమనార్హం.

మొత్తమ్మీద, తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి ఓ ‘స్టార్‌’ ఖారారైపోగా, ఇంకో స్టార్‌ ‘ఆన్‌ ది వే’ అనుకోవాలేమో. ఇంతకీ, అజారుద్దీన్‌ హైద్రాబాద్‌ నుంచి ఎంపీ స్థానానికి పోటీ చేసేందుకు సుముఖంగా వున్నట్లేనా.? వేచి చూడాల్సిందే.