వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అనూహ్యంగా ఎదిగారు సినీ నటుడు పృధ్వీ. ‘థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’ అంటూ తెలుగు సినీ పరిశ్రమలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న పృధ్వీ, వైసీపీ నేతగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. ఆ పార్టీలో కీలక పదవులు పొందడం చూశాం. వైసీపీ అధికారంలోకి రావడంతోనే ఆయనకు ఎస్వీబీసీ ఛైర్మన్‌గా ఛాన్స్ దక్కింది. అలీ, మోహన్‌బాబు లాంటోళ్ళకే దక్కని పదవి పృధ్వీకి దక్కడం.. అందర్నీ విస్మయానికి గురిచేసింది.
‘వైఎస్ జగన్ మనిషి’ అనే గుర్తింపు ఆయనకు పార్టీలో దక్కినా.. ఎంత వేగంగా గుర్తింపు దక్కిందో.. అంతే వేగంగా అదిప్పుడు అటకెక్కింది. పార్టీ ముఖ్య నేతల అపాయింట్‌మెంట్ కూడా ఇప్పుడు పృధ్వీకి దొరకడంలేదట. దాంతో, చేసేది లేక.. మళ్ళీ సినిమాలు చేసుకుంటున్నాడు పృధ్వీ. ఎస్వీబీసీలో పదవి దక్కాక, జగన్ మీద మమకారంతో తెలుగు సినీ పరిశ్రమని తూలనాడారాయన.
తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని గౌరవించడంలేదన్నది అప్పట్లో ఆయన చేసిన ఆరోపణ. ఆ కారణంగా, పరిశ్రమ పెద్దల ఆగ్రహాన్నీ పృధ్వీ చవిచూడాల్సి వచ్చింది. తన ఓవారాక్షన్‌కి తగిన శిక్షే పడిందని ఆయన ఇప్పుడు తనలో తాను అనుకోవాల్సి వస్తోందనుకోండి.. అది వేరే సంగతి. తానింకా వైసీపీలోనే వున్నానని పృధ్వీ చెబుతున్నా, ఆయన్ని వైసీపీలో ఎవరూ పట్టించుకోవడంలేదు. ‘వెనకనుంచి వాటేసుకోవాలనుకున్నా..’ అంటూ ఎస్వీబీసీ ఉద్యోగినితో ఆయన నడిపిన ‘ఫోన్ రొమాన్స్’ ఆయన పదవి పోవడానికి కారణమయ్యింది.
అయితే, అదంతా ఫేక్ అని అంటున్నారాయన. సొంత పార్టీకి చెందినవారే వెన్నుపోటు పొడిచారన్నది పృధ్వీ ఆరోపణ. అయినాగానీ, ఆయన వైసీపీకి ఎదురు తిరిగే పరిస్థితి లేదు. ఎందుకంటే, అక్కడ ఆల్రెడీ పెద్ద మచ్చ పడిపోయింది మరి. తేడా వస్తే, పృధ్వీని ఆ కేసులో నిండా ఇరికించేయడం అధికార పార్టీకి పెద్ద కష్టమేమీ కాదు. అలాగని, పృధ్వీ సైలెంటుగా వుంటున్నారా.? అంటే అదీ లేదు. వైసీపీలో వెన్నుపోటుదారులపై విమర్శలు చేస్తున్నారు.. ‘గ్యాంగ్ రేప్’ అనే పెద్ద పెద్ద పదాలూ వాడుతున్నారు.
ఇంకోపక్క, మళ్ళీ సినిమా అవకాశాల కోసం నానా పాట్లూ పడుతున్నారు. ఎలాంటోడు, ఎలా అయిపోయాడూ.. అని ఆయన సన్నిహితులు పృధ్వీ తీరు చూసి వాపోవాల్సి వస్తోంది. అన్నట్టు, పృధ్వీ నోటి దురద వ్యవహారం అధిష్టానం దృష్టికి వెళ్ళిందనీ, త్వరలో పార్టీ నుంచి ఆయన్ని సాగనంపబోతున్నారనీ ప్రచారం జరుగుతోంది.