థియేటర్ కోసం కొట్టుకోవడం ఒక్కటే తక్కువ!

టాలీవుడ్ లో పెడపోకడలు పెరిగిపోతున్నాయి. అసలే సెంటిమెంట్లు రాజ్యమేలే చిత్రపరిశ్రమలో.. ఫలానా థియేటర్లో విడుదల చేస్తే బాగుంటుందనే సెంటిమెంటుకూడా ఒకటి ఉంటుంది. అదే ఇప్పుడు రెండు చిత్రాల మధ్య గొడవకు కారణం అవుతోంది. ఒక చిత్రానికి సంబంధించిన నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్ తో చాన్నాళ్ల కిందటే ఒప్పందాలు పూర్తి చేసుకుని, థియేటర్ ను కూడా బుక్ చేసుకున్న తరువాత.. మరో చిత్రానికి సంబంధించిన టీం డిస్ట్రిబ్యూటర్ ఆఫీసు మీద దాదాపు దాడిచేసినంత హడావుడి సృష్టిస్తూ.. చిన్న సినిమాకు ఆ థియేటర్ ను ఎలా ఇస్తారు? అంటూ గొడవకు దిగడం.. ఫిలింనగర్ లో చర్చకు దారితీస్తోంది. థియేటర్ అన్నాక ఎవరు ముందు బుక్ చేసుకుంటే వారికివ్వడం జరుగుతుంది గానీ.. ఇలా రచ్చచేసి దక్కించుకోవాలంటే ఎలా? అనే విసుర్లు వినిపిస్తున్నాయి.

వివరాల్లోకి వెళితే.. సందీప్ కిషన్ హీరోగా చక్రి చిగురుపాటి ఓచిత్రం నిర్మిస్తున్నారు. కేరాఫ్ సూర్య టైటిల్ తో రూపొందిన ఇది ఉభయభాషా చిత్రం. గతంలో స్వామిరారా ను చేసిన నిర్మాత, తెలుగు చిత్రంగా దీనినిరూపొందించి.. దాని తమిళ వెర్షన్ ను అక్కడ రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి నిర్మాతలు నైజాం డిస్ట్రిబ్యూటర్లుగా సునీల్ తో ఒప్పందం చేసుకున్నారు. పదో తేదీన ఇది విడుదల కావాలి.

అయితే సోమవారం ఓ రాధ్దాంతం మొదలైంది. మనోజ్ హీరోగా చేసిన ‘ఒక్కడు మిగిలాడు’ చిత్రానికి సంబంధించిన కొందరు వ్యక్తులు డిస్ట్రిబ్యూటర్ ఆఫీసుకు వెళ్లి నానా రచ్చ చేసినట్లుగా చెప్పుకుంటున్నారు. డబ్బింగ్ సినిమాకు, అది కూడా చిన్న సినిమాకు కూకట్‌పల్లిలోని మల్లికార్జున థియేటర్ ను మీరెలా ఇస్తారు. ఆ థియేటర్ మాకు కావాల్సిందే అంటూ గొడవ చేశారట. నిజానికి ఇది డబ్బింగ్ సినిమా కాదు మొర్రో.. తెలుగుచిత్రానే తమిళంలోకి డబ్ చేసి చేస్తున్నాం… అని వారు చెబుతున్నా పట్టించుకోలేదుట.

హీరో, నిర్మాత అంతా తెలుగువాళ్లే అయితే.. దీనిని తమిళ సినిమా అంటారేమిటా అనేది వారి వాదన. మహాఅయితే విజయ్ హీరోగా వస్తున్న అదిరింది సినిమా గురించి గానీ, విశాల్ హీరోగా వస్తున్న చిత్రం గురించి గానీ.. డబ్బింగ్ అనే క్లెయింతో రచ్చ జరగాలే తప్ప.. ఇది తెలుగులో స్ట్రెయిట్ సినిమా అని చెబుతున్నా వినకుండా, చిన్న సినిమాకు ఆ థియేటర్ ఎలా ఇస్తారంటూ రచ్చ చేశారుట. చాలా రోజుల ముందే చేసుకున్న అగ్రిమెంటుకు, ఒప్పందాలకు విలువలేకుండా ఇలాంటి రభసలు చేస్తే.. చిన్న సినిమాలు ఎలా మనుగడ సాగిస్తాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.